కృష్ణా : మండలంలోని నల్లగట్టులో గుట్టుగా మైనింగ్ కొనసాగుతోంది. అనుమతుల్లేకుండా అక్రమార్కులు ఇష్టానుసారంగా గుట్టను ధ్వంసం చేస్తూ భారీ పేలుడు పదార్థాలతో బ్లాసింగ్‌కు పాల్పడుతున్నారు. గత రెండు, మూడేళ్లలో గుట్ట రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. కర్ణాటకలోని బళ్లారిలో మాదిరిగానే ఇక్కడి రాయిని తీస్తున్నారు. ఇక్కడి అధికారులు, నాయకులు అవినీతి, అక్రమార్కలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఇళ్లలో నుంచి బయటకు రావొద్దుంటూ..
ప్రతి రోజు బ్లాసింగ్ ఇళ్లు, ప్రభుత్వ భవనాలు బీటలు వారుతున్నాయి. నివాస ప్రాంతాల్లో రాళ్లు పడుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో జాతీయ రహదారిపై కొన్నిసార్లు వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దు నిర్వాహకులు హుకుం జారీ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు కొన్నేళ్లుగా అనుభవిస్తున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు ఇచ్చే మామూళ్ల మత్తులో చూసీచూడనట్లుగా వ్యహరిస్తున్నారు. ప్రతినిత్యం ఈ క్వారీ, క్రషర్ మిషన్లలో అమాయక ప్రజలు, కూలీలు పనిచేస్తూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు బయటకు పొక్కకుండా అక్కడికక్కడే వారికి కొంత డబ్బు ఇచ్చి మూసివేసిన సందర్భాలు ఉన్నాయని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
శ్రమదోపిడీ
ఈగుట్టకు ఉన్న క్వారీల్లో వందల సంఖ్యలో కూలీలు పనిచేస్తున్నారు. వారు రోజంతా పనిచేస్తే కనీసం రెండు, మూడు వందలు కూలి కూడా ఇవ్వడంలేదని కర్ణాటక కూలీలు ఆరోపిస్తున్నారు. వారు పనిచేసేచోట ప్రమాదం అని తెలిసినా కూడ వారు తమ పిల్లలను అక్కడే ఉంచుకుంటున్నారు.
బోరు బావుల్లో నీళ్లు తగ్గుతున్నాయ్
బ్లాస్టింగ్ మూలంగా పక్కనే ఉన్న తమ పొలాల్లోని బోరుబావుల్లో నీళ్లు తగ్గుతున్నాయి. గతంలో 100 ఫీట్లల్లో నీళ్లు వచ్చేవి. ఇప్పుడు 200 ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. బ్లాస్టింగ్ చేసిన సమయంలో భూమి అదిరి నీళ్లు కిందకు వెళ్తున్నాయి.
– బ్డుమోళ్ల రాము, గుడెబల్లూర్ గ్రామం.
దుమ్ము ధూళితో రోగాలు
గుట్టకు ఏర్పాటుచేసిన క్రషర్ మిషన్ల మూలంగా వచ్చే దుమ్ము ధూళితో రోగాలు వస్తున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలు అయితే చాలు ఆ దుమ్మధూళితో నరకం చూస్తున్నాం. జాతీయ రహదారికి పక్కన ఉన్న క్రషర్ మూలంగావచ్చే దుమ్ముతో రోడ్డుపై వెళ్లే ద్విచక్ర, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
– చెవిటోళ్ల సురేష్.గుడెబల్లూర్ గ్రామం.
కొన్నింటికి అనుమతులున్నాయ్
నాలుగు క్వారీలు, మూడు స్టోన్ క్రషర్లకు మైనింగ్ శాఖ నుంచి అనుమతలున్నాయ్. 551, 348, 355, 356 సర్వే నంబర్‌లలో మొత్తం 66ఎకరాల్లో మైనింగ్‌కు అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని క్వారీల్లో పనులను నిలిపివేసి, గనుల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తాం.
– వెంకటేష్, తహసీల్దార్, కృష్ణా
అనుమతుల్లేకుండా బ్లాస్టింగ్
ఊపందుకున్న మైనింగ్
రెచ్చిపోతున్న అక్రమార్కులు
మామూళ్ల మత్తులో అధికారులు
బీటలు వారుతున్న నివాసగృహాలు
భయాందోళనలో ప్రజలు
నల్ల‘గుట్టు’ రట్టయ్యేనా..!
నల్ల‘గుట్టు’ రట్టయ్యేనా..!
నల్ల‘గుట్టు’ రట్టయ్యేనా..!