
చిన్నారులకు కంటి పరీక్షలు
పాలమూరు: జిల్లాలో 0– 6 ఏళ్లలోపు చిన్నారుల్లో కంటిచూపు సమస్యలు తెలుసుకోవడానికి సోమవారం నుంచి 70రోజుల పాటు ప్రత్యేక కంటి పరీక్షల క్యాంపులు నిర్వహించడానికి వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని 1,163 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు బాలబాలికలు 51,772 మంది ఉన్నట్లు నిర్ధారించారు. గుర్తించిన చిన్నారులందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయడానికి ఆరోగ్య శాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆర్‌బీఎస్‌కే నుంచి ఏడు మొబైల్ హెల్త్ టీంల ద్వారా ప్రతిరోజు బృందాలు అంగన్‌వాడీ కేంద్రాలు సందర్శించి స్థానికంగా ఉండే చిన్నారులకు కంటి పరీక్షలు చేయనున్నారు. ఒక్కో బృందం ప్రతిరోజు 120 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయాలనే లక్ష్యం కేటాయించారు. ప్రత్యేక పీఎంఓ టెక్నీషియన్స్ పరికరాల ద్వారా చిన్నారుల కళ్లను పరీక్షించనున్నారు. దీంట్లో కంటి సమస్యలు ఉన్నవారితోపాటు కంటి ఆపరేషన్ అవసరం ఉన్న చిన్నారులను గుర్తించి హైదరాబాద్ సరోజినిదేవి రాములమ్మ ఆస్పత్రిలో చికిత్స చేయనున్నారు.
గతేడాది రెండు దశల్లో..
వైద్య, ఆరోగ్యశాఖ చేస్తున్న కంటి పరీక్షల విధానం వల్ల జిల్లాలో ఉన్న నిరుపేద చిన్నారులకు ఉపయోగకరంగా మారనుంది. ఆరేళ్లలోపు బాల, బాలికల్లో సాధారణంగా కంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి చిన్నారులను గుర్తించడానికి ఈ శిబిరాలు ఉపయోగపడనున్నాయి. గతేడాది 2024లో రెండు దశల్లో కంటి పరీక్షల విధానం నిర్వహించారు. మొదటి దశలో 12,674 మందికి పరీక్షలు చేసి 786 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇక రెండో దశలో 46,415 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి 1,486 మందికి కంటి సమస్య ఉన్నట్లు నిర్ధారించారు.
ఎనిమిది రకాల సమస్యలు
సాధారణంగా కంటికి సోకే వ్యాధుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితా ఆధారంగా వ్యాధి లక్షణాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ లక్షణాలతో ఏ వ్యాధితో బాధపడుతున్నారు అనే విషయం ఈ శిబిరాలలో తెలుస్తోంది. దీంట్లో మోతిబిందు, కార్నియల్ అంధత్వం, డయాబెటిక్ రెటినోపతి, గ్లుకోమా (నీటి కాసులు), మెల్లకన్ను దృష్టి మాంధ్యం, కండ్లకలక, విటమిన్ ఏ లోపం వంటి వాటిని గుర్తించి అవసరం అయిన వారికి చికిత్స లేకపోతే ఆపరేషన్ చేస్తారు.
జిల్లాలోని 1,163 అంగన్‌వాడీల పరిధిలో 51,772 మంది గుర్తింపు
నేటి నుంచి 70 రోజుల్లో స్క్రీనింగ్
పూర్తిచేయాలని యాక్షన్ ప్లాన్