
మహిళపై మత్తు మందు చల్లి.. నంచర్లలో భారీ చోరీ
మహమ్మదాబాద్: మహిళపై మత్తు మందు చల్లి పట్టపగలే చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నంచర్లలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివగోపాల్ ఇంట్లోనే కిరాణం దుకా ణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తన కోడలిని దుకాణంలో కూర్చోబెట్టి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే రెక్కీ నిర్వహించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మధ్యాహ్నం దుకాణానికి వచ్చి సదరు మహిళను వాటర్ బాటిల్ అడిగారు. ఆమె వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇవ్వబోగా ఆమె ముఖంపై మత్తుమందు చల్లారు. దీంతో స్పృహతప్పి పడిపోయిన మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టి ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు నగలు, బీరువాలో దాచిన రూ.6 లక్షల నగ దు, 12 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మొత్తం దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చిన యజమాని శివగోపాల్ జరిగిందంతా చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ
నంచర్లలో పట్టపగలే ఇంట్లో చోరీ జరిగిన విష యాన్ని తెలుసుకున్న మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో కుటుంబీకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీంతో వేలిముద్రలు, దొంగలు ఉపయోగించిన పరికరాలు ఏమైనా ఉన్నాయా.. మత్తు ఎలా చల్లారు.. దుకాణంలో ఏమైనా ఆధారాలు ఉ న్నాయా అన్న కోణంలో పరిశీలించారు. దొంగలు ముందే రెక్కీ నిర్వహించి ఇలాంటి ఘటనకు పాల్ప డి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తెలిసి న వారెవరైనా ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. బాధితుడు శివగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.