
ప్రాథమిక హక్కులపై అవగాహన ఉండాలి
చిన్నచింతకుంట: రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహణ కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర సూచించారు. చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో చిన్నచింతకుంటలో మహిళా సంఘం సభ్యులు, కస్తూర్బ విద్యార్థినీలకు ప్రాథమిక హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఒక నేరం జరిగినప్పుడు చూసినా, తెలిసినా కచ్చితంగా సాక్ష్యం చెప్పాలని.. అప్పుడే నేరస్తుడికి శిక్ష పడుతుందన్నారు. నేరాల అదుపునకు చట్టాలతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమన్నారు. ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణకు ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని వాటిని ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్నేహ పూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం 2024 ప్రకారం బాలలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు లేదా 100 డయల్ చేయాలని, 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లయ్య, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్, ఏపీఎం విష్ణుచారి, మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు పద్మమ్మ, లీగల్ వలంటీర్ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.