
బీసీల వాటా తేల్చాకే ఉద్యోగ ప్రకటనలివ్వాలి
కందనూలు: బీసీల వాటా తేల్చాకే ఉపాధ్యాయ, ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు ఇవ్వాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బీసీ చైతన్య సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తానంటూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. బీసీల రిజర్వేషను తేల్చకుండా నోటిఫికేషన్లు ఇస్తానంటే చూస్తూ ఊరుకోమని.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏకమై భరతం పడతామని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం, కుట్ర, నయవంచన చేసి పాలన సాగిస్తోందని.. ఎన్ని రోజులు సాగదని తెలిపారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 62 మంది అగ్రవర్ణాల వారేనని.. అలాంటప్పుడు బీసీలకు కల్యాణలక్ష్మి ఎలా చేరుతుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మేధావులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి..
కల్వకుర్తి రూరల్: రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే బీసీల సత్తా ఏంటో అన్ని పార్టీలకు చూపిద్దామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌కు వెళ్తూ పట్టణంలోని బీసీ ముఖ్యనాయకులతో కాసేపు మాట్లాడారు. బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని.. 2028ని లక్ష్యంగా చేసుకొని స్థానిక ఎన్నికల్లో బీసీల పార్టీ, బీసీ గుర్తుతోనే పోటీ చేద్దామన్నారు. నల్లమల నుంచి వచ్చిన క్రూర మృగాలను తరిమి వేయాల్సిన సమయం వచ్చిందని.. 2028లో బీసీ ముఖ్యమంత్రి పాలన చేస్తారని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటామని.. నియోజకవర్గానికి బలమైన బీసీ నాయకుడిని కన్వీనర్‌గా త్వరలోనే నియమిస్తామన్నారు. ఉపాధ్యాయ లోకం బీసీ ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. బీసీ జేఏసీ నేత హరిశంకర్‌గౌడ్, జానయ్య యాదవ్, మేకల రాజేందర్, సదానందంగౌడ్, రమేష్‌చారి, రుక్కుల్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, కురిమిద్దె మాజీ ఉపసర్పంచ్ విజయభాస్కర్, జమ్ముల శ్రీకాంత్, నర్సింహ, దుర్గాప్రసాద్, కరెంటు రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.