
డంపింగ్ యార్డుకు కొత్త రోడ్డు
డంపింగ్ యార్డు వరకు పూర్తయిన ఫార్మేషన్ రోడ్డు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కోయిల్‌కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డును ఆనుకుని కొన్ని నెలలుగా కొనసాగుతున్న భూత్పూర్–చించోళి ఎన్‌హెచ్ పనులతో అప్రోచ్ రోడ్డును పూర్తిగా తొలగించారు. అసలే అంతంత ఆదాయ వనరులున్న మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త రోడ్డు నిర్మాణంతో అదనపు భారం పడింది. ఒకవైపు నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న క్రమంలో కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు డంపింగ్ యార్డు వద్ద అడ్డుగా ఉన్న పెద్ద గుట్టను తవ్వి 200 ఫీట్ల వెడల్పుతో జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ పనులు నిర్విరామంగా జరుగుతుండటంతో డంపింగ్ యార్డు చేరుకోవడానికి కొత్త అప్రోచ్ రోడ్డు కోసం 2024–25 మున్సిపల్ బడ్జెట్‌లో రూ.35 లక్షలు కేటాయించారు. తాజాగా 2025–26 బడ్జెట్‌లో రూ.88 లక్షలు మంజూరు చేశారు. ఇలా మొత్తం రూ.1.23 కోట్లు వెచ్చిస్తున్నారు.
ఎన్‌హెచ్ కోసం తొలగించడంతో..
వాస్తవానికి కోయిల్‌కొండ ఎక్స్ రోడ్డు మొదలుకుని 300 మీటర్ల వరకు గతంలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నేరుగా డంపింగ్ యార్డు చేరుకోవడానికి కేవలం 50 మీటర్ల దూరమే ఉండేది. అది కాస్తా ఎన్‌హెచ్ కోసం తొలగించడంతో కొత్తగా అప్రోచ్ రోడ్డు కోసం పలుమార్లు ఉన్నతాధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. చివరకు ఎన్‌హెచ్ కింది నుంచి మూడు మలుపులతో ఉండేలా మొదట ఫార్మేషన్ రోడ్డు పూర్తి చేశారు. ఇదంతా గుట్ట ప్రదేశం కావడంతో సీసీ కోసం రిటైనింగ్ వాల్ తప్పనిసరి అయింది. కనీసం దీని పొడవు 550 మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ పనులు మొత్తం వర్షాకాలం వచ్చేలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. గత సీజన్‌లో వర్షాలు కురిసినప్పుడు తడి, పొడి చెత్త లోడ్‌తో స్వచ్ఛ ఆటోలు, మున్సిపల్ ట్రాక్టర్లు, ఇతర వాహనాలు డంపింగ్ యార్డు వరకు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి గుంతలు పడటంతో పైకి ఈ వాహనాలు వెళ్లడానికి చివరకు జేసీబీల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక గుట్టపై నుంచి ప్రత్యామ్నాయంగా వంతెన నిర్మిద్దామన్నా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఇంకా రోడ్డు కోసం గుట్టను పెద్ద ఎత్తున కనీసం 50 మీటర్ల లోతుకు తవ్వుతూనే ఉన్నారు. దీంతో ఇప్పట్లో వంతెన పనులు చేపట్టడం సాధ్యం కాదని తేలింది. అయితే స్ట్రక్చర్ డామేజీ కింద మున్సిపల్ కార్పొరేషన్‌కు కేవలం రూ.ఐదు లక్షలే పరిహారం చెల్లించడం గమనార్హం.
ఎన్‌హెచ్ పనులతో పాతది పూర్తిగా తొలగింపు
2 విడతలుగా రూ.1.23 కోట్ల వ్యయం
మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చిన పరిహారం రూ.5 లక్షలే
నగర పాలక సంస్థపైనే పడిన అదనపు భారం

డంపింగ్ యార్డుకు కొత్త రోడ్డు