
కొనసాగుతున్న రైల్వే వంతెన పనులు
జడ్చర్ల టౌన్: పట్టణంలోని సిగ్నల్‌గడ్డ వద్ద రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో బుధవారం మూడు గడ్డర్లను బిగించగా.. మరో రెండు గడ్డర్లను గురువారం బిగించనున్నారు. దీంతో వంతెనకు సంబంధించి కీలక ఘట్టం ముగిసినట్లవుతుంది. రైల్వే అధికారులు మధ్యాహ్నం 1.15 గంటలకు రైళ్ల రాకపోకలు నిలిపివేయగా భారీ క్రేన్ సాయంతో మొదటి గడ్డర్‌ను వంతెన గోడలపై ఏర్పాటుచేసి ప్లేట్లపై అమర్చారు. తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు రైల్వే అధికారులు మరోమారు రైళ్ల రాకపోకలు నిలిపివేయడంతో రెండు గడ్డర్లను అమర్చారు. జాతీయ రహదారులశాఖ ఈఈ నాగేందర్, డీఈ రాజేందర్, ఏఈ రవికుమార్ పనులను పర్యవేక్షించారు. గురువారం మధ్యాహ్నం 1.15 గంటలకు తిరిగి గడ్డర్ల బిగింపు కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా జాతీయ రహదారులశాఖ అధికారులు మాట్లాడుతూ.. వంతెన పనుల్లో కీలక ఘట్టం పూర్తి కావచ్చిందని, గడ్డర్లు, ఇంటర్నల్, ఎండ్ డయాప్రేమ్స్ బిగించిన తర్వాత స్లాబ్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో వంతెనపై రాకపోకలు కొనసాగుతాయని తెలిపారు.