
ప్రశాంత్‌రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరి అరెస్ట్
భూత్పూర్: దేవరకద్ర బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండా ప్రశాంత్‌రెడ్డి హత్య కుట్ర కేసులో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి తెలిపారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నారని.. అనుమానితులుగా ఉన్న రాఘవేందర్‌రెడ్డి అలియాస్ చిన్న, శ్రీకాంత్‌యాదవ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. అరుణాచలం నవీన్‌కుమార్ తండ్రి హత్య కేసులో కొండా ప్రశాంత్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, అలాగే తిమ్మసానిపల్లికి చెందిన రూప్‌సింగ్ తండ్రి వద్ద ఇటుకలు కొనుగోలు చేసి రూ.40 వేలు ఇవ్వకుండా ప్రశాంత్‌రెడ్డి బెదిరించారని తెలిపారు. రూప్‌సింగ్ తనకు జరిగిన అన్యాయాన్ని అరుణాచలం నవీన్‌కుమార్‌ను కలిసి చెప్పగా తనకు రూ.5 లక్షలిస్తే కొండా ప్రశాంత్‌రెడ్డిని చంపుతానని తెలుపగా, రూ.లక్ష ఉన్నాయని, చంపాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం అరుణాచలం నవీన్ తన స్నేహితుడు కర్ణాటకలోని పుట్‌పాక్‌కు చెందిన శ్రీకాంత్‌తో ప్రశాంత్‌రెడ్డిని హత్య చేయించడానికి రెండు నెలలుగా మాటు వేసుకుని ఉన్నారు. అయితే అరుణాచలం నవీన్ తండ్రి హత్య కేసులో ఏ–2గా ఉన్న కుమ్మరి నర్సింహ విషయం తెలుసుకోవడానికి రూప్‌సింగ్‌కు ఫోన్ చేయగా కొండా ప్రశాంత్‌రెడ్డిని హత్య చేయడానికి చేసిన కుట్ర వివరాలు వెల్లడించారని.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను ఫోన్‌లో రికార్డు చేసి విషయాన్ని కొండా ప్రశాంత్‌రెడ్డి తెలిపారని వివరించారు. దీంతో కొండా ప్రశాంత్‌రెడ్డి దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అరుణాచలం నవీన్, రూప్‌సింగ్‌ను పట్టుకొని విచారించగా నేరం అంగీకరించారని ఎస్పీ వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయగా మరో నిందితుడు శ్రీకాంత్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.
వివరాలు వెల్లడించిన
మహబూబ్‌నగర్
ఎస్పీ జానకి