
గుర్తుతెలియని ద్రావణం తాగి..
అమరచింత: అప్పటి వరకు ఇంటి ముంగిట సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు గుర్తు తెలియని ద్రావణం తాగి ఒకరు హఠాత్తుగా మృతిచెందగా.. మరో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన తెలుగు వంశీ, గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మణికంఠ, ఏడాదిన్నర వయసున్న ఆర్తిక సంతానం. వీరిద్దరూ కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం తమ ఇంటి మట్టి మిద్దైపె కుటుంబ సభ్యులతో కలిసి చౌడు వేస్తున్నారు. చిన్నారులు ఇద్దరూ ఇంటి బయట ఆడుకుంటూ రోడ్డుపై పారవేసిన సీసాను చేతితో తీసుకుని మూత తెరిచి అందులోని ద్రావణం తాగారు. కాసేపటికి ఆర్తిక నోటి నుంచి నురుగులు రావడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుమారుడు మణికంఠకు మాటలు రాకపోవడంతో ఏం తాగారో తెలియదని, అబ్బాయి శరీరంపై బొబ్బలు వస్తుండటంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏడాదిన్నర చిన్నారి మృతి.. అపస్మారకస్థితిలో మరో బాలుడు...
అమరచింతలో విషాద ఘటన