
జిల్లా కేంద్రంలోనూ...
జిల్లా కేంద్రంలో గోదావరి రోడ్డు, పాత మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి తెల్ల వారు జామున, రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గోదావరి రోడ్డు కాలనీ వాసులు కొందరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెల్లవారు జామున కూలీలతో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతూ పట్టణంలో నిర్మాణాలు జరిగే ప్రాంతానికి చేరవేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిపై పోలీసులు, గనుల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అయినా జరిమానాలు కట్టి అక్రమ రవాణా సాగిస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గోదావరి పుష్కరఘాట్ నుంచి నేరుగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు.
చెన్నూరు పట్టణం, హాజీపూర్, వేంపల్లి, గుడిపేట గోదావరి తీరాల నుంచి గ్రామాల్లోనూ ఇసుక రవాణా జరుగుతోంది. దండేపల్లి మండలం కాసిపేట గోదావరి తీరంలో బ్యాక్ వాటర్ తగ్గినప్పుడల్లా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు గోదావరి తీరం వెంట నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరిలో ఇసుక ఖాళీ అవుతోంది. నగదుగా మారి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. జిల్లాలోని నదీ తీర గ్రామాల్లో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భారీ యంత్రాలను నదిలో దించి ఇసుకను తోడుకుపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గతేడాది అధిక వర్షాలతో దొరకని ఇసుక..
గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు మండు వేసవిలోనూ నది నిండుగా ఉంది. దీంతో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. స్థానిక అవసరాల కోసం హాజీపూర్ మండలం వేంపల్లిలో అధికారులు ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. అయితే వర్షాలు కురిసి నీరు రావడంతో అక్కడ ఇసుక తీయడం లేదు. జిల్లాలో గోదావరి పొడవునా ఇసుక లభించని పరిస్థితి నెలకొంది.
అవసరం మేరకు అనుమతి..
ఈ క్రమంలో టీఎస్‌ఎండీసీ(తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అవసరం మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తోంది. కాళేశ్వరం ముంపు ప్రాంతంగా ఉన్న నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మేటలు తోడేందుకు గతేడాది మార్చిలో టెండర్లు పిలిచి కొత్త అగ్రిమెంట్లు చేశారు. ఇందులో కొన్ని పట్టాభూముల్లో ఉన్నాయి. ఇక కోటపల్లి మండలం కొల్లూరులో మాత్రమే ప్రస్తుతం ఒక ఇసుక రీచ్ నడుస్తోంది.
దూర భారంతో రీచ్‌కు రాని లారీలు..
అయితే కొల్లూరు రీచ్ దూరంగా ఉండడంతో హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల వారికి ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదు. ఎండ తీవ్రత కూడా రవాణాకు ఆటంకంగా మారుతోంది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు మాత్రం ఇక్కడి నుంచే ఇసుక రవాణా జరుగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం పగటిపూటనే ఇసుక రవాణా చేయాలి.
‘అదనపు’ బకెట్ దందా...
ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇచ్చిన కొల్లూరు క్వారీలో యథేచ్చగా అదనపు బకెట్ దందా కొనసాగుతూనే ఉంది. వినియోగదారులు టీఎస్‌ఎండీసీ వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్న క్యూబిక్ మీటర్ల మేరకు లారీల్లో ఇసుక నింపాలి. అయితే కాంట్రాక్టర్లు, జేసీబీ ఆపరేటర్లు, అక్కడి సిబ్బందిని మేనేజ్ చేస్తూ లారీల్లో జేసీబీ అదనపు బకెట్ ఇసుక నింపుతున్నారు. అదనంగా పోసిన ఇసుకకు డబ్బులు అక్కడే వసూలు చేస్తున్నారు. చలానా రూపంలో కట్టినవి మాత్రం టీఎస్‌ఎండీసీకి జమ అవుతున్నాయి. అదనపు బకెట్ ఇసుకతో వాహన పరిమితి మించి ఓవర్‌లోడ్‌తో ఇసుక లారీలు వెళ్తున్నాయి.
నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో కట్టిన చలానా ప్రకారమే వేబ్రిడ్జిలో ఇసుక తూకం వేయాలి. అయితే ఈ నిబంధనలేమి అమలు కావడం లేదు. రీచ్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అదనపు బకెట్ దందా ఆగడం లేదు. రోజూ పరిమితి మించి గోదావరి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలతో చెన్నూరు, జైపూర్, ఇందారం వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ‘సాక్షి’లో కథనం రావడంతో టీఎస్‌ఎండీసీ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో మళ్లీ అదనపు బకెట్ దందా ఊపందుకుంది.

కొల్లూరు క్వారీ వద్ద నదిలో ఏర్పాటు చేసిన దారి
Comments
Please login to add a commentAdd a comment