కిడ్నీలు జర భద్రం..!
మంచిర్యాలటౌన్: జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని డయాలసిస్ కేంద్రాలకు రోగుల తాకిడి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను మూత్రపిండాలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. బీపీ, ఎలక్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు డయాబెటీస్, హైబీపీ వంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దీంతో శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం, బీపీ, షుగర్ వంటి వాటిని అదుపులో ఉంచుకుంటే మూత్రపిండాల వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చని, ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు 90మందికి పైగా రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారంటే వ్యాధి తీవ్రత అర్థమవుతోంది. నేడు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
జిల్లాలో..
జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ చేస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పది పడకలు ఉండగా రోజుకు 28మందికి, బెల్లంపల్లి ఆస్పత్రిలో ఐదు పడకలు ఉండగా ఎనిమిది మందికి, చెన్నూర్‌లో ఐదు పడకలు ఉండగా 10మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 10,330 మంది, బెల్లంపల్లిలో 7,172మంది, చెన్నూర్‌లో 3,010మంది డయాలసిస్ చేయించుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఉచితంగా డయాలసిస్ చేస్తుండగా.. ఆరోగ్యశ్రీ లేని వారు ప్రైవేటు ఆస్పత్రల్లో నెలకు రూ.10వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పాడైన మూత్రపిండాలకు చికిత్స తీసుకున్నా పూర్తి సమర్థవంతంగా మారవు. క్రమంగా గుండెజబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. కిడ్నీని మార్పిడికి దాతలు దొరకడం కష్టం కాగా, ఆపరేషన్ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య
ప్రభుత్వ, ప్రైవేటు డయాలసిస్ కేంద్రాలకు రోగుల తాకిడి
నేడు వరల్డ్ కిడ్నీ డే
నీరు ఎక్కువగా తాగాలి
ప్రాథమిక దశలోనే కిడ్నీ సమస్యలను గు ర్తించి చికిత్స తీసుకుంటే డయాలసిస్ వరకు వెళ్లే ప్రమాదం ఉండ దు. ఎక్కువగా నీరు తాగుతూ నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవడంలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, చేపలు, చిలగడ దుంపలు, కాలిఫ్లవర్, పండ్లు ఆహారంగా తీసుకోవాలి. ధూమపానం, ఆల్కాహాల్ తాగడం, గుట్కా, కర్ర నమలడం, చుట్ట తాగడం, పెయిన్ కిల్లర్ మందులు గాని, డాక్టర్ అనుమతి లేకుండా హైడోస్ మందులు తీసుకోవద్దు. ఉప్పు తగ్గించి, తగినంత నీరు, పౌష్టికాహారం తీసుకుంటూ శరీర బరువు, గుండె పనితీరు అదుపులో ఉంచుకోవాలి. మూడు నెలలకు ఒకసారి కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ రాకేశ్‌కుమార్ చెన్న,
నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల
కిడ్నీలు జర భద్రం..!
కిడ్నీలు జర భద్రం..!
Comments
Please login to add a commentAdd a comment