‘ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలను బహిష్కరించాలి’
నస్పూర్: కాంట్రాక్టర్లకు తొత్తులుగా వ్యవహరిస్తూ సింగరేణి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలను బహిష్కరించాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. సింగరేణి ఐక్యవేదిక సంఘాల నాయకులతో కలిసి ఆయన గురువారం నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనాలని ఆయా సంఘాల నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బొగ్గు బ్లాకుల వేలానికి విరుద్ధమని ఎన్నికలకు ముందు ప్రకటించిన గుర్తింపు సంఘం నాయకులు నేడు మాటమార్చడంలో మర్మమేమిటో కార్మికులు ఆలోచించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఎస్ సెంట్రల్ కమిటీ నాయకులు తిప్పారపు సారయ్య, వి.అనిల్‌రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పి.అశోక్‌కుమార్, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోళ్ల అంజన్న, కార్యదర్శి మేకల పోషమల్లు, ఐఎఫ్‌టీయూ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
స్థానికులకు అన్యాయం
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో స్థానిక భూనిర్వాసిత, కాంట్రాక్టు కార్మికులకు పవర్‌మేక్ కంపెనీ తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇతర రాష్ట్రాల కార్మికులు, ఉద్యోగులకు వేలల్లో జీతాలు, ఇంటి కిరాయిలు చెల్లిస్తోందని, ఇక్కడి కార్మికులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. జైపూర్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్టీపీపీ నుంచి పవర్‌మేక్ కంపెనీ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఎస్ నాయకులు సారయ్య, సాయికృష్ణరెడ్డి, సంపత్, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment