
పండుగ పూట విషాదం
● ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యార్థి మృతి ● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు ● మిన్నంటిన రోదనలు
ఆదిలాబాద్‌టౌన్: పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు హోలీ సంబరాల్లో స్నేహితులు, కుటుంబీకులతో గడిపిన ఓ విద్యార్థి ద్విచక్రవాహనం అదుపుతప్పి కానరాని లోకాలకు చేరాడు. తమ కుమారుడు లేడన్న నిజాన్ని ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త కుమ్మర్‌వాడకు చెందిన జిల్లెడ్వార్ ఊశన్న మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు జిల్లెడ్వార్ రుషికుమార్ (16) ఆదిలాబాద్ పట్టణంలోని సేవదాస్ విద్యామందిర్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం రుషికుమార్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన ఆమ్లే ప్రేమ్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచ్‌కంటికి చెందిన బడేన్వార్ అశ్విన్‌తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు. అనంతరం అశ్విన్‌ను ఇంటివద్ద దింపడానికి ముగ్గురు బైక్‌పై వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు తిరిగి వస్తుండగా పట్టణంలోని ఎరోడ్రాం సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అతివేగంగా నడపడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కాగా రుషికుమార్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలపాలైన ఆమ్లే ప్రేమ్ బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
వారం రోజుల్లో పరీక్షలు ఉండగా..
పదో తరగతి పరీక్షలు వారం రోజుల్లో జరగనున్నాయి. అంతలోనే హోలీ సంబరాల్లో కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అప్పటివరకు ఇంటి వద్ద హోలీ సంబరాల్లో మునిగితేలిన కుమారుడు తిరిగిరాని లోకాలకు చేరాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలియడంతో తోటి స్నేహితులు, బంధువులు వారి నివాసానికి చేరుకున్నారు. తోటి విద్యార్థులు కంటతడి పెట్టారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందంజలో ఉన్న విద్యార్థి మృతి చెందడంతో పాఠశాల యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరో విద్యార్థికి గాయాలతో బతికి బయటపడ్డాడు.

పండుగ పూట విషాదం
Comments
Please login to add a commentAdd a comment