● పెరిగిన ఎండ తీవ్రత ● రాబోయే రెండు రోజులు మరింత పెరిగే
జిల్లాలో ఐదు రోజులుగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు
తేదీ గరిష్టం కనిష్టం
11 38.8 22.8
12 39.2 23.3
13 39.4 24.0
14 40.4 20.3
15 39.6 24.4
జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం
నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన రహదారి
మంచిర్యాలటౌన్: భానుడు భగ్గుమంటున్నాడు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గుతోంది. దీంతో వేడి తీవ్రత పెరుగుతోంది. మార్చి రెండో వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా నలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు సుర్రమంటున్నాడు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడి పెరగడంతో అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారు. తలకు ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలను తీసుకున్నా, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రెండు రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. వేసవిలో వచ్చే జలుబు, పలు రకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సరఫరా చేశారు.
వడదెబ్బతో జాగ్రత్త..
ఎండలు పెరగడంతో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేని స్థితికి చేరితే, శరీరంలోని ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, నీటి శాతం తగ్గి(డీహైడ్రేషన్) సత్తువలేని స్థితికి చేరటం వల్ల వడదెబ్బ వస్తుంది. దీంతో గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు గట్టిపడడం, చర్మం ఎర్రగా మారటం, వామిటింగ్ సూచనలు ఉండటం, వాంతి చేసుకోవడం, మూర్చ రావడం, తలనొప్పి, కోమాలోకి వెళ్లడం వంటి లక్షణాలు వడదెబ్బలో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ సోకిన వారికి వైద్యుల సలహాతో మందులను వాడడం, రోజుకు 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలంటున్నారు. పండ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రసం ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. తెల్లరంగు బట్టలు ధరించడం, బయటకు ఎండలో వెళ్లేవారు గొడుగు వాడటం, నల్ల కళ్లద్దాలు ధరించి, మసాలాలు, కారం, నూనెలు, ఫాస్ట్‌ఫుడ్, మత్తుపానీయాలకు దూరంగా ఉండాలి.
చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి
వేసవి కాలం ప్రారంభం కావడంతో చిన్నారులను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో వెళ్లకుండా చూడాలి. కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి. ఎండకు వెళితే తలకు రుమాలు కట్టుకుని, టోపీ పెట్టుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రావడం, వాంతులు, విరేచనాలతో శరీరం శక్తిని కోల్పోతుంది. అత్యవసరం అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. వేడి కారణంగా చెమట శరీరం నుంచి వెళ్లడంతో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోపౌడర్ లేదా ఉప్పు, చెక్కర కలిపిన నీటిని బాగా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కడపడితే అక్కడి నీరు తాగడం వల్ల, అతిసార వ్యాధి ప్రబలే ప్రమాదం ఉంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తినడం, ఐస్‌క్రీంలు, కుల్ఫీలు కలుషిత నీటితో త యారు చేసే అవకాశం ఉన్నందున వాటిని పిల్లలకు తినిపించక పోవడమే మంచిది.
వృద్ధుల్లో సమస్యలు
వృద్ధుల్లో దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావంతో పాటు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎండ వేడిని తట్టుకోలేరు. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే దీర్ఘకాలిక వ్యాధులపై మరింత ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. వేడిని తట్టుకునేందుకు శరీరానికి తగినంత నీరు అవసరం కాబట్టి, నీరు బాగా తాగడంతోపాటు, కొబ్బరి బోండాం, మజ్జిగ, నిమ్మర సం ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లో ఉండే గదిని చల్లగా ఉంచేలా చూడాలి. సౌకర్యంగా ఉండే కాటన్ దుస్తులను ధరించి, శరీర ఉష్ణోగ్రతలు పెరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వృద్ధుల్లో వేడిని తట్టుకునే స్థాయి తక్కు వ కావడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. చెమట అధి కంగా రావడంతో అలసటకు గురై, అనా రోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.
● పెరిగిన ఎండ తీవ్రత ● రాబోయే రెండు రోజులు మరింత పెరిగే
Comments
Please login to add a commentAdd a comment