వినియోగదారుడు హక్కులు తెలుసుకోవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వినియోగదారుడు తన హక్కుల గురించి తెలుసుకోవాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్‌తో కలిసి పెట్రోలియం సంస్థలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు చేసినప్పుడు మోసపోతే పోర్టల్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంకుల్లో నగదు లావాదేవీల విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తినా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం నాణ్యతగా లేకపోయినా, సరైన ఆహారం అందించకపోయినా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందించకపోయినా, వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందుల షాపులో ఇవ్వకపోయినా మెడికల్ బోర్డు/డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. కాలపరిమితి ముగిసిన వాటిని విక్రయిస్తే కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌తో కలిసి వినియోగదారుల హక్కుల సంబంధిత పోస్టర్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment