పండిద్దాం పొగాకు..
● చెన్నూర్ చేలల్లో సాగు.. ● పంట మార్పిడికి ముందుకు వస్తున్న రైతులు ● తక్కువ నీటి వసతి ఎక్కువ దిగుబడి ● పంటను ఆశించని తెగుళ్లు
చెన్నూర్‌రూరల్: ఎప్పుడూ ఒకే రకం పంటల సాగుతో భూమిలో సారం దెబ్బతింటుంది. పంట మార్పిడి విధానం పాటించాలని వ్యవసాయాధికారులు కూడా తరచూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు దీనిని పట్టించుకోరు. కానీ, చెన్నూరు మండలంలో కొందరు రైతులు అధికారుల సూచనలతో పంట మార్పిడి విధానంతో లాభాలు గడిస్తున్నారు. మిర్చి పంట సాగు చేసి పురుగు ఆశించడం, సరైన దిగుబడి రాకపోవడం, మద్దతు ధర లేకపోవడంతో విసిగిపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. కొందరు మిర్చి పంటకు బదులుగా పొగాకు సాగుచేస్తున్నారు. ఈ పంటకు తక్కువ నీరు, తెగుళ్ల బెడద లేకపోవడంతో సాగుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. చెన్నూర్ మండలంలో గతేడాది కేవలం రెండెకరాల్లో పొగాకు సాగు కాగా, ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 20 ఎకరాల వరకు సాగు చేశారు. చెన్నూర్ మండలం అక్కెపల్లి, శివలింగాపూర్‌లో మాత్రమే సాగవుతుంది. మిర్చి, పత్తి పంట పెట్టుబడి తరహాలోనే పొగాకు పంటకు పెట్టుబడి అవుతుందని, లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయని రైతులు పేర్కొంటున్నారు.
చీడ, పీడలు, తక్కువే..
పొగాకు పంటలో కలుపు, తెగుళ్ల బెడద ఉండదు. ఒక లద్దె పురుగు, తేనె మంచు మాత్రమే ఆశిస్తుంది. దీని నివారణకు లామ్డాసైహలోత్రిన్, ఇమిడాక్లోప్రిడ్ మందును ఎకరాకు 120 ఎంఎల్ పిచికారీ చేస్తే సరిపోతుంది. లేదా క్లోరాంధ్రనిలిప్రోల్ 60 ఎంఎల్ పిచికారీ చేయాలి. ఈ పంటకు కోతులు, అడవి పందులు, పశువుల బెడద ఉండదు.
ఆరబెట్టే విధానం..
పంట వేసిన ఐదు నెలలకు దిగుబడి చేతికి వస్తుంది. ఆకులను తెంపి సోలార్ కవర్ ఉన్నట్లయితే 8 నుంచి 10 రోజులు ఆరబెడితే సరిపోతుంది. లేదంటే తోరణాలుగా తయారు చేసి 20 రోజుల నుంచి 25 రోజులు ఆరబెట్టాలి. మార్కెట్‌కు తీసుకువెళ్లే సమయంలో బేల్లుగా తయారు చేసి తేమశాతం లేకుండా చూసుకోవాలి. క్వింటాల్ ధర రూ.15 వేల వరకు వస్తుంది. జనగామ జిల్లా ములకనూరులో పొగాకు మార్కెటింగ్ సౌకర్యం ఉన్నప్పటికి ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాకపోవడంతో రైతులు ఆంధ్రకు వెళ్లాల్సి వస్తుంది. రైతులు ఒకే రకం పంట సాగు చేయకుండా ఇలా పంట మార్పిడి చేస్తే అధిక లాభాలు పొందవచ్చు.
రైతులు ముందుకు రావాలి
పంట మార్పిడిని అవలంబించేందుకు రైతులు ముందుకు రావాలి. అక్కెపల్లి, శివలింగాపూర్ గ్రామాల రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. ఈ పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించవు. పశువులు, ఆడవిపందులు, కోతుల బెడద ఉండదు. నీటి తడులు కూడా తక్కువగా ఉంటాయి. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
– యామిని, ఏవో, చెన్నూర్
పంట మార్పిడి చేయాలి
ఎప్పటికీ ఒకే రకం పంటలు కాకుండా పంట మార్పిడి చేస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. మా క్లస్టర్‌లో కొందరు రైతులు పొగాకు సాగు చేశారు. పంట దిగుబడి కూడా బాగానే వస్తుంది. రైతులు ఆలోచించాలి.
– రాజశేఖర్, ఏఈవో, అక్కెపల్లి, క్లస్టర్
సాగు విధానం
పొగాకు ఐదు నెలల పంట. ఆగస్టు, సెప్టెంబర్‌లో సాగుచేయాలి. ఇక్కడి రైతులకు నారు ఆలస్యంగా రావడంతో నవంబర్‌లో మొక్కలు పెట్టా రు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొత్తూరులోని జీపీఏ కంపెనీ వారు నారును అందించారు. ఒక్కో మొక్కకు రూ.1 చొప్పున పడుతుంది. ఎకరాకు 10 వేల మొక్కలు నాటుతారు. జీపీఏ కంపెనీ వారే పండిన పంటను కొనుగోలు చేస్తారు. ఇక్కడ సాగు చేసే పొగాకు రకం వైట్‌బెర్లీ రకం. ఎకరాకు రూ.70 వేలు ఖర్చవుతుంది. మొక్కలు నాటుపెట్టే సమయంలో ఆఖరి దుబ్బులో 15 కిలోల యూరియా, ఒక డీఏపీ 50 కిలోల బస్తా వేస్తారు. నాటు పెట్టి ఆకులు వచ్చే సమయంలో 20 రోజులకు 50 కిలోల పొటాష్‌ని వేస్తారు. నీటితడులు మూడుసార్లు అందిస్తారు. 25 రోజుల్లో అందించాల్సి ఉంటుంది. నాటు పెట్టిన 50 రోజుల్లో అమ్మోనియా వేస్తారు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
పండిద్దాం పొగాకు..
పండిద్దాం పొగాకు..
పండిద్దాం పొగాకు..
Comments
Please login to add a commentAdd a comment