చేపలు వేటకు వెళ్లి శవమయ్యారు
సోన్: చేపలు పట్టడానికి వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. సోన్ మండల కేంద్రానికి చెందిన గుమ్ముల సాయన్న (48) ఎప్పటిలాగే శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరిలోకి చేపలు పట్టడానికి వెళ్లాడు. రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సాయన్న కోసం కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో సోన్ పాత బ్రిడ్జికి సమీపంలోని ఒక నీటి మడుగులో కాళ్లకు చేపల వల చుట్టుకొని వ్యక్తి చనిపోయి ఉన్నాడని అటుగా వెళ్లినవారు గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో అక్కడకు వెళ్లి చూడగా సాయన్న చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిసింది. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దిలావర్‌పూర్‌లో మరొకరు..
దిలావర్‌పూర్: మండల కేంద్రానికి చెందిన గూండ్ల నడిపి పోశెట్టి (46) ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి శనివారం స్థానిక కొత్త చెరువు వద్దకు వల తీసుకువెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఆదివారం కొత్త చెరువులో మృతి చెంది ఉండడాన్ని బంధువులు గమనించి అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment