మందమర్రిరూరల్: 315 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. మందమర్రి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ శశిధర్‌రెడ్డితో కలిసి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇటీవల దేవాపూర్ పీఎస్‌లో నమోదైన నకిలీ పత్తినాల కేసులో గుడిమల్ల చంద్రయ్య, కూనారపు బాలకృష్ణ, మహమ్మద్ సాహెబ్ జానీ, ముల్కల్ల సుధీర్, గోవిందుల శంకర్‌ను అదుపులో తీసుకున్నారు. అదే కేసులో మరో నిందితుడు అబ్దుల్ రజాక్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి గాలించగా బుధవారం మందమర్రిలో పట్టుబడ్డాడు. అతన్ని విచారించగా గుజరాత్ రాష్ట్రం నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పట్టణానికి చెందిన కాశిపాక తిరుపతి సహాయంతో పొన్నారానికి చెందిన బొలిశెట్టి జనార్దన్‌కు విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వారు అందించిన సమాచారంతో దేవాపూర్‌లోని చింతగూడ సల్పల వాగు పక్కన దాచిన 315 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వీటి విలువ రూ.7,87,500 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కాసిపేట ఏవో ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించి అబ్దుల్ రజాక్, కాశిపాక తిరుపతి, బొలిశెట్టి జనార్దన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, దేవాపూర్ ఎస్సై అంజనేయులు పాల్గొన్నారు.