మంచిర్యాలటౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డుల జారీ, దివ్యాంగులకు సదరం శిబిరాల నిర్వహణ, మరణించిన వృద్ధాప్య పింఛన్‌దారుల స్థానంలో స్పౌజ్‌లకు పింఛన్ మంజూరు చేయాలని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, ఏకరూప దుస్తుల తయారీ కేటాయించాలని తెలిపారు. జిల్లాలో చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ రబీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఎక్కువ సంఖ్యలో కేటాయించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ఎల్‌డీఎం తిరుపతి పాల్గొన్నారు.