● సీజన్‌కు ముందే రైతుల చెంతకు
● ఏటా కోట్లలో వ్యాపారం
● మార్చిలోనే 1,126 క్వింటాళ్లు పట్టివేత
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది సీజన్‌కు నాలుగు నెలల ముందుగానే నిషేధిత పత్తి విత్తనాల వ్యాపారం జోరందుకుంది. మార్చిలోనే ఆరుచోట్ల రూ.27,35,000 విలువగల 1,126 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని 34 మందిపై కేసులు నమోదు చేశారు. కొంతమంది కొన్నేళ్లుగా అక్రమ దందా నిర్వహిస్తూ కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా దందా మాత్రం ఆగడంలేదు. గ్లైసిల్ విత్తనాలుగా పిలువబడే బీటీ–3, హెచ్‌టీ పత్తి విత్తనాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు. ఈ విత్తనం సాగు చేసిన రైతులు కలుపు నివారణకు ఉపయోగించే గ్లైఫోసెట్ మందు పిచికారీ చేస్తున్నా దిగుబడి తగ్గడంతో పాటు భూసారం కోల్పోతుంది. కలుపు నివారణకు కూలీల కొరతను అధిగమించడానికి రైతులు ఈ విత్తనాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని సీజన్‌కు ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ నుంచి విత్తనం, మహారాష్ట్ర నుంచి గ్లైఫోసెట్ జిల్లాకు చేరవేస్తున్నారు.
కిలో రూ.2,500 నుంచి రూ.3 వేలు
ఖరీఫ్ సాగులో 3.40 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటుండగా ఇందులో పత్తి సాగు అధికంగా ఉంటుంది. రైతులు సొంతభూమితో పాటు పెద్దఎత్తున భూములు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నా రు. ఇప్పటికే పత్తి అమ్ముకున్న కొంతమంది రైతులు పంటను తొలగించి రానున్న ఖరీఫ్ సీజన్ కోసం భూమిని చదును చేస్తున్నారు. కలుపు నివారణ కో సం కొన్నేళ్లుగా రైతులు గుర్తింపు లేని విత్తనాలు వి నియోగిస్తున్నారు. పత్తి సాగు, రైతుల అవసరాలను అవకాశంగా చేసుకుని విత్తన దందా రాయుళ్లు ముందస్తుగానే విత్తనాలు డంపింగ్ చేసుకుంటున్నారు. ఏటా ప్రభుత్వం నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా విత్తన విక్రయాలు సాగుతునే ఉన్నాయి. లూజ్‌గా కిలోల చొప్పున విత్తనాలను బస్తాలతో పాటు ఆకర్షనీయమైన ప్యాకింగ్‌లలో నాణ్యత విత్తనాలు పోలిన మాదిరి ప్యాకెట్లు సైతం చేరుతున్నాయి. కిలోకు రూ.1000 నుంచి రూ.1500 వరకు కొనుగోలు చేసి రైతులకు కిలోకు రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఇందులో కొన్ని దిగుబడి వస్తుండగా ఎక్కువశాతం రైతులు నాణ్యత లేక నష్టపోతున్నారు. మోసపోయిన రైతులు బయటకు చెప్పుకుంటే కేసులు నమోదవుతాయని భావించి మిన్నకుండి పోతున్నారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి మంచిర్యాల, మందమర్రి, భీమిని, కన్నెపల్లి, బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేస్తే రైతులు మోసపోకుండా ఉంటుంది.
మూడేళ్లలో 3,975 క్వింటాళ్లు
మూడేళ్ల కాలంలో 18 చోట్ల ఈ నకిలీ విత్తనాలు పట్టుబడగా రూ.95,04,4,000 విలువ గల 3,975 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని 35 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది దిగుబడి వచ్చిన పంట విక్రయిస్తున్న సమయంలో నకి లీ కేటుగాళ్లు ముందస్తుగానే సరఫరా చేస్తే తనిఖీలు ఉండవని భావించి విత్తన దందాకు తెరలేపారు. ఈఏడాది ఇప్పటి వరకు ఆరుచోట్ల రూ.27,35,000 విలువ గల 1,126 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకుని 34 మందిపై కేసులు నమోదు చేశారు. కొంతమంది బడా వ్యాపారులు కిందిస్థాయిలో ఏజెంట్లను నియమించుకుని రైతుల చెంతకు చేరవేస్తున్నారు. పట్టుబడిన సమయంలో కిందిస్థాయి వ్యక్తులపైనే కేసులు నమోదు చేస్తుండడంతో ఆసలు సూత్రధారి తప్పించుకోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా అక్రమ దందా సాగిస్తున్న వ్యక్తులు ఇది మాకు ‘మామూలే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పూర్తిస్థాయిలో అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం లేదు. ఈ విత్తన సాగులో కలుపు నియంత్రణకు ఉపయోగించే గ్లైఫోసెట్ గడ్డినివారణ మందు వాడకం పెరిగిపోతోంది. దీని ద్వారా పర్యావరణం, భూసారం దెబ్బతినడంతో పాటు రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విత్తనాలను నిషేధించాయి. సంబంధిత శాఖ అధికారులు నిషేధిత పత్తి విత్తనాలు రైతులకు చేరకుండా చర్యలు తీసుకోవాలి.
ఈ ఏడాది మార్చిలో పట్టుబడిన విత్తనాలు
ఈ నెల 2న దహెగాం మండలం అత్తిని నుంచి భీమిని మండలం వడాల గ్రామానికి 3 క్వింటాళ్ల (రూ.6.85 లక్షల విలువై న) నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తుండగా మల్లిడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకుని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.
ఈనెల 9న కన్నెపల్లి మండలం సుర్జపూర్‌లో రూ.3.50 లక్షల విలువైన 140 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ముగ్గు రు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఈనెల 14న మంచిర్యాల రైల్వేస్టేషన్ స మీపంలో ఆటోలో తరలిస్తున్న రూ.1.70 లక్షల విలువైన 100 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ఎనిమిదిమందిపై కేసులు నమోదు చేశారు.
ఈ నెల 23న తాండూర్ మండలం అచ్చులాపూర్, గోపాల్‌నగర్ సమీపంలో డీసీ ఎం వ్యాన్ నుంచి కారులోకి డంపు చేస్తు న్న రూ.6,17,500 విలువైన 247 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని తొ మ్మిది మందిపై కేసులు నమోదు చేశారు.
ఈ నెల 23న కాసిపేట మండలం కొండాపూర్‌లో రూ.1,25,000 విలువైన 50 కి లోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకు ని ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.
ఈనెల 26న బుధవారం కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో రూ.7,87,500 విలువైన 315 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు.
మూడేళ్లలో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు, నమోదైన కేసులు
సంవత్సరం కేసులు క్వింటాళ్లు విలువ(రూ.ల్లో) పట్టుబడిన వ్యక్తులు
2022–23 5 1,193 34,50,000 10
2023–24 2 1,310 18,10,000 08
2024–25 11 1,562.5 42,44,400 17
2025–26 6 1,126 27,35,000 34
కఠిన చర్యలు తప్పవు
నిషేధిత పత్తి విత్తనా లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరుచోట్ల 27.35 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. 34 మందిపై కేసులు నమోదు చేశాం. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు ని ర్వహిస్తున్నారు. ఈ విత్తనాల వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నాం.
– కల్పన, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల
గ్లైసిల్ దందా ఆగేనా?