జన్నారం: ఇసుక అక్రమ రవాణ చేస్తున్న వారిపై అటవీశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. టైగర్‌జోన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇందన్‌పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రేంజ్ పరిధిలోని బుట్టాపూర్ వాగులో నుంచి ఇసుక తోడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. బుట్టపూర్‌కు చెందిన తిప్పని విశ్వాస్, జన్నారంకు చెందిన దాసిరి అన్వేష్, కలమడుగుకు చెందిన పిండి ముజ్జన్నలకు చెందిన ట్రాక్టర్లను సీజ్ చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా మొర్రిగూడ ప్రాంతంలో తనిఖీ చేయగా మరో ట్రాక్టర్ ఇసుకతో వస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుక తవ్వడం, తరలించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.