● నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
పెంచికల్‌పేట్: మండలంలోని లోడుపల్లి అటవీ ప్రాంతంలో నీలుగాయిని హతమార్చిన వేటగాళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పెంచికల్‌పేట్ రేంజ్ అధికారి అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లోడుపల్లి అటవీ ప్రాంతంలోని సహజ నీటి వనరుల వద్ద నీలుగాయిని హతమార్చానే పక్కా సమాచారంతో రావడంతో సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించాం. కొండపల్లి గ్రామానికి చెందిన చప్పిడే వెంకటేశ్, ఎల్లూర్ గ్రామానికి చెందిన దుర్గం రవీందర్‌ల ఇళ్లల్లో తనిఖీలు చేయగా.. నీలుగాయి మాంసం లభ్యమైంది. వారిని విచారించగా కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం రవి, గొర్లపల్లి మొండి, మన్నెపల్లి శ్రీహరి, ఆత్రం భీమయ్యలతో కలిసి నీలుగాయిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. వెంకటేశ్, దుర్గం రవీందర్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయముర్తి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. దుర్గం రవీందర్ పెంచికల్‌పేట్ మండలంలోని మెరెగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పరారీలో ఉన్న మిగతా నలుగురిని పట్టుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్‌వో శంకర్, ఎఫ్‌బీవోలు సంగదీప్, సతీష్, లచ్చన్న, మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు.