
‘నాలెడ్జ్ ఆన్‌వర్డ్స్’తో చదువుపై ఆసక్తి
బెల్లంపల్లి: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుపై ఆసక్తి పెంచుకునేందుకు బెల్లంపల్లికి చెందిన ఏకదంత మిత్రమండలి సభ్యులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్, టీవీలకు అతుక్కుపోకుండా తమకు తెలియకుండానే విద్యాభివృద్ధి, విజ్ఞాన అంశాలు తెలుసుకునేలా, చదువుపై దృష్టిసారించేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభా పాటవాలు వెలికి తీయాలనే ఉద్దేశంతో ‘నాలెడ్జ్ ఆన్‌వర్డ్స్’ ప్రారంభించారు. విద్యార్థుల ను ఆకర్షించేలా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డులో గోడలపై విజ్ఞానం, విద్య, శాసీ్త్రయ అంశాలు, గణిత సూత్రాలు, దేశ, రాష్ట్ర చిత్రపటాలను రంగురంగులతో చిత్రీకరిస్తున్నారు. ఇందుకు అయ్యేఖర్చును ఏకదంత మిత్ర మండలి సభ్యులు తలా కొంత భరించుకుంటున్నారు. పదిమందికి పైగా ఉన్న సభ్యుల్లో ప్రైవేట్ టీచర్లు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు కావడం గమనార్హం. ప్రస్తుతం గోడలపై చిత్రీకరించిన అంశాలను తెలుసుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగానే ఏప్రిల్ చివరి వారం నుంచి ఈ కార్యక్రమాన్నీ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నిర్వాహకుడు బొంతల శ్రీనివాస్ తెలిపారు.