
ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీస్
బాసర: గోదావరి నదిలో పిల్లలతో కలిసి దూకేందుకు యత్నించిన వ్యక్తికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోయగల్లికి చెందిన కోమటి గంగప్రసాద్, భార్య లక్ష్మి నిజామాబాద్‌లోని బట్టల దుకాణంలో పని చేస్తుంటారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు వర్షిణి, రషిత ఉన్నారు. కాగా కుటుంబ సమస్యల కారణంగా తన ఇద్దరు పిల్లలను తీసుకుని గంగప్రసాద్ బుధవారం బాసర మండల కేంద్రంలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్‌సింగ్ గమనించి హుటాహుటిన వారి వద్దకు చేరుకున్నాడు. ఆత్మహత్యకు యత్నిస్తున్న గంగప్రసాద్‌ను అతని ఇద్దరి పిల్లలను దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. గంగప్రసాద్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. కాగా చాకచక్యంగా వ్యవహరించి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన కానిస్టేబుల్ మోహన్‌సింగ్‌ను ఎస్సై గణేశ్, ఇతర సిబ్బంది అభినందించారు.