
ఆగని ఇసుక దందా
● ఇటీవల ఐదు ట్రాక్టర్లు పట్టివేత ● కొనసాగుతున్న అక్రమ రవాణా ● తాజాగా మరో ఐదు ట్రాక్టర్లపై కేసు
దండేపల్లి: అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. అక్రమార్కులు అధికారులకు, పోలీసులకు ఏమాత్రం భయపడకుండా తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దండేపల్లి మండలం కాసిపేట గోదావరి తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా, ఇటీవల ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇవేమి పట్టించుకోకుండా గురువారం మళ్లీ ఇసుకాసురులు 15 ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్‌ఐ భూమన్న, సిబ్బందితో కలిసి గోదావరి తీరానికి చేరుకున్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా కొన్ని ఇసుక ట్రాక్టర్లను ధర్మపురి వైపు మళ్లించారు. దీంతో కేవలం ఐదు ట్రాక్టర్లు మాత్రమే పట్టుపడ్డాయి. కేసు నమోదు చేశామని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.