
ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందాలి
● ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ చేయాలి ● రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: అర్హులైన ప్రతీ ఒక్కరికి సన్నబియ్యం అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సన్న బియ్యం పంపిణీ, రేషన్‌కార్డులు, ప్రజల స్పందనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్‌కార్డులు కలిగిన వారికి ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సన్నబియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని స్వీకరించాలని, సన్న బియ్యం పంపిణీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. రేషన్ దుకాణాల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన, గ్రామసభల్లో నూతన రేషన్‌కార్డులు, కార్డుల్లో పేర్లు మార్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి అర్హులకు త్వరగా రేషన్‌కార్డులు అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ నూతన రేషన్‌కార్డులు, పేర్ల మార్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీ లించి అర్హులకు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు.