
మహనీయుని ఆశయ సాధనకు కృషి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
మంచిర్యాలఅగ్రికల్చర్: దేశంలో సమానత్వం కోసం పోరాడి, సమాజ హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని, ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి కలెక్టర్‌తోపాటు మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు, కార్పొరేషన్ ఈడీ పోటు రవీందర్‌రెడ్డి, దుర్గప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, దళితుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. 27ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఉప ప్రధానమంత్రిగా, రక్షణ, వ్యవసాయ, కార్మిక, రవాణా, తదితర శాఖల కేంద్రమంత్రిగా సేవలందించారని తెలిపారు. వినూత్న సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి విశిష్ట కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, నీరటి రాజేశ్వరి, రౌఫ్‌ఖాన్, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.