
నూతన గనులు ఏర్పాటు చేయాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో నూతన గనులను ఏర్పాటు చేయాలని ఐఎన్టీయూసీ నేతలు శనివారం కంపెనీ డైరెక్టర్‌ను కోరారు. ఆర్జీవన్ ఏరియాలో పర్యటన నిమిత్తం వచ్చిన సింగరేణి డైరెక్టర్(పా) కొప్పుల వెంకటేశ్వర్లును ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బీ.జనక్‌ప్రసాద్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలో సుదీర్ఘకాలం ఒకేస్థానంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలన్నారు. ప్రస్తుతం పదేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని, దీన్ని ఐదేళ్లకు కుదించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉద్యోగుల రక్షణ, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అధికారుల పనితీరును అంచనా వేసే విధంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. అనంతరం డైరెక్టర్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, ధర్మపురి, కాంపల్లి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతిగౌడ్, ఆర్జీ 1 ఏరియా ఉపాధ్యక్షులు సదానందం, నాయకులు వడ్డేపల్లి దాస్, గడ్డం కృష్ణ, లింగమూర్తి, సాయి, సూర్యనారాయణ పాల్గొన్నారు.