
పండుగ వేళ విషాదం..!
● దైవదర్శనానికి వెళ్తూ విద్యార్థి దుర్మరణం ● బైక్‌ను ఢీకొన్న టాటాఏస్
హసన్‌పర్తి: పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. స్నేహితురాలితో కలిసి బైక్‌పై దైవదర్శనానికి వెళ్తుండగా టాటాఏస్ ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన హనుమకొండ –కరీంనగర్ ప్రధాన రహదారిపై హసన్‌పర్తి నలగట్టుగుట్ట సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేటకు చెందిన రామటెంకి శ్రవణ్ కుమారుడు ఉదయ్(18) హసన్‌పర్తి పరిధి అన్నాసాగరంలో అద్దెకు ఉంటూ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అదే కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న స్నేహితురాలితో కలిసి బైక్‌పై అన్నాసాగరం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో హసన్‌పర్తి మండల కేంద్రంలోని నల్లగట్టుగుట్ట సమీపంలో హనుమకొండ నుంచి ఎల్కతుర్తి వైపునకు వస్తున్న ఓ టాటాఏస్ బస్సును అనుసరిస్తూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఉదయ్‌తో పాటు అతని స్నేహితురాలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఉదయ్ మృతి చెందాడు. ఉదయ్ తండ్రి శ్రవణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.