
కూరగాయలు @ కిష్టంపేట
● పందిళ్లు వేసి సాగు చేస్తున్న రైతులు
● అధిక దిగుబడులు పొందుతూ ఆదర్శం
చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామంలో రైతులు ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇళ్ల వద్ద పెరళ్లలో, చేలలో కూరగాయలను పండిస్తూ ప్రతీరోజు రూ.200 నుంచి రూ.300 వరకు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలను ప్రతీరోజు చెన్నూర్, మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాలకు తీసుకెల్లి విక్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 400 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా ఒక కిష్టంపేటలోనే 290 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో తీగజాతి బీర 160 ఎకరాలు, దొండ 90 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మిగతా అల్చంత, బెండ, మిర్చి, గోంగూర, తోటకూర, వంకాయలు సాగు చేస్తున్నారు.
తీగజాతి కూరగాయలపై దృష్టి..
రైతులు ఎక్కువగా తీగజాతి కూరగాయలు బీర, దొండలను సాగు చేస్తున్నారు. బీర సాగు వరి పంట పొలాల్లో గట్టలపై చేస్తుండగా పెరళ్లలో పందిళ్లు వేసి దొండసాగు చేస్తున్నారు. గ్రామంలో రైతులు సుమారు 30 ఏళ్ల నుంచి దొండ సాగు చేస్తున్నారు. తీగజాతి కూరగాయల కోసం ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. పందిరి కోసం రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కూలీలకు రూ.10వేల వరకు ఖర్చవుతోంది. దొండ విత్తన కొమ్మలకు సుమారు రూ.500ల వరకు ఖర్చవుతోంది. ఒకసారి తోట పెడితే 30 నుంచి 40 ఏళ్ల వరకు కాపు వస్తుంది.దొండ విత్తన కొ మ్మలు పెట్టిన తర్వాత ఏడాదికి కాపుకు వస్తుంది. వారానికి సుమారు 50 కిలోల వరకు దొండకాయలు దిగుబడి వస్తాయి.వీటిని చెన్నూర్, మంచిర్యా ల, గోదావరిఖని మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు.
సస్యరక్షణ చర్యలు..
కాగా తీగజాతి పంటలకు వారానికి రెండు సార్లు నీటి తడులు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సస్యరక్షణలో భాగంగా ప్రధాన పంటలో గడ్డి తొలగించాలి. రాలిన కాయలను ఏరివేయాల్సి ఉంటుంది. దొండ పంటకు ప్రధానంగా పండు ఈగ ఆశించి నష్టపరుస్తుంది. దీని నివారణకు అ సిఫేట్ ఎకరానికి 400 గ్రాములు లీటర్ నీటికి కలి పి పిచికారీ చేయాలి. సహజ సస్యరక్షణలో భాగంగా పండు ఈగను నివారించేందుకు రైతులు పిరమిన్ ట్రాప్స్ ఉపయోగిస్తున్నారు. పందిళ్ల ద్వారా తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.