
మామిడి తోటకు టెండర్
భీమారం: మామిడి తోటలను ఎవరైనా వ్యాపారులు గుత్తకు తీసుకుంటూ ఉంటారు. కానీ మండల కేంద్రంలోని రైతు చెరుకు శ్రీరాంరెడ్డి వినూత్నంగా ఆలోచించి తన మామిడితోటకు బుధవారం సీల్డ్‌కవర్ టెండర్లు నిర్వహించి అప్పగించాడు. భీమారంలో ఉన్న ఆయన తోటలో 500 మామిడిచెట్లు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం రైతులు వారి తోటలను కాయలను బట్టి ధర నిర్ణయించి వ్యాపారులకు గుత్తకు ఇస్తుంటారు. ఈ పద్ధతి అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. కానీ విద్యావంతుడైన శ్రీరాంరెడ్డి తన తోటను గుత్తకు తీసుకోవడానికి ఎవరు వచ్చినా మొదట తోట, అందులోని కాయలు పరిశీలించాలని సూచించాడు. సీల్డ్ కవర్ టెండర్ నిర్వహిస్తున్నానని, ఆసక్తి గల వ్యాపారులు ఈ టెండర్‌లో పాల్గొనాలని కోరాడు. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పది మంది టెండర్లలో పాల్గొన్నారు. ఓ వ్యాపారి రూ.7లక్షలకు టెండర్ ద్వారా తోటను దక్కించుకున్నాడు.