
భారత్ గౌరవ్ వేసవి ప్రత్యేక రైళ్లు
● ఈనెల 23 నుంచి మే 2 వరకు హరిద్వార్ రిషికేశ్–వైష్ణోదేవియాత్ర ● అతి తక్కువ ధరలతో దైవ దర్శనాలు ● మంచిర్యాల స్టేషన్‌లో హాల్టింగ్
మంచిర్యాలఅర్బన్: దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల దర్శనానికి భారత్ గౌరవ్ పేరిట వేసవి ప్రత్యేక రైళ్లను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని టూరిజం మానిటర్లు ప్రశాంత్, శ్రీకాంత్ తెలిపారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో పుణ్యక్షేత్రాలు, ప్యాకేజీలు, రైళ్ల వివరాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం నాలుగు ప్యాకేజీలుగా ఈనెల 23 నుంచి జూన్ 12వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. 23 నుంచి మే 2 వరకు ప్యాకేజీ–1లో గురుకృప రైలు ద్వారా హరిద్వార్ రిషికేష్–వైష్ణోదేవి యాత్ర అతి తక్కువ ఽటికెట్ ధరలతో దైవదర్శనాలు చేసుకోవచ్చన్నారు. పది రోజులు కొనసాగే యాత్రలో భాగంగా విజయవాడ నుంచి బయల్దేరనున్న రైలు గుంటూరు, నల్గొండ, సిక్రిందాబాద్, కాజీపేట్ మీదుగా కాగజ్‌నగర్, బల్లార్షా, వార్థా నాగపూర్ మీదుగా వెళ్తుందన్నారు. ఈ ఏడాది భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో నిలుపుదల (హాల్టింగ్) అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈనెల 25న హరిద్వార్ చేరుకుంటుందని అక్కడి నుంచి బస కేంద్రానికి తరలిస్తారన్నారు. మానసదేవి ఆలయ దర్శనం, గంగాహారతి, 26న రిషికేష్ చేరుకుని గంగాస్నానాలు, రామ్‌జూలా, లక్ష్మణ్‌జూలా, రాత్రి 9 గంటలకు ఆనంద్‌సాహేబ్‌కు బయల్దేరుతుందన్నారు. 27న గురుద్వారా, నైనాదేవి, ఆలయ సందర్శన రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌కు వెళ్తుందన్నారు. 28న హర్మిందర్ సాహెబ్, అకల్‌తక్తా వాఘా సరిహద్దు సందర్శన, అనంతరం రాత్రి 10 గంటలకు అమృతసర్ నుంచి మాతావైష్ణోదేవి కాట్రాకు రైలు వెళ్తుందని పేర్కొన్నారు. ఎకానమీ స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీలు ఉన్నాయన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహరం, లంచ్ డిన్నర్ ఉంటుందని పేర్కొన్నారు. రైలులో టూరిస్ట్ ఎస్కార్ట్‌లతోపాటు పర్యటన సమయంలో టూర్ మేనేజర్లు ఉంటారని వివరించారు. ప్యాకేజీ–2లో కాశీ గయ, ప్రయోగ అయోధ్య, (సరస్వతి పుష్కరాల ప్రత్యేకం), మే 8 నుంచి 17 వరకు, ప్యాకేజీ–3లో అరుణాచలం–మధురై–రామేశ్వరం మే 22 నుంచి 30 వరకు, ప్యాకేజీ–4లో పంచ జ్యోతిర్లింగాల యాత్ర జూన్ 4నుంచి 12 వరకు ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 040–27702407, 9701360701, 9281030711, 9281030712, 9281030749, 9281030750 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.