
వేడెక్కుతున్న ఓసీపీలు
● 40డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు ● ఉపశమన చర్యలు చేపట్టిన కంపెనీ ● పని వేళలు మార్చాలని డిమాండ్
పని వేళలు మార్చాలి..
ఎండ తీవ్రత దృష్ట్యా ఓసీపీల్లో పని వేళలు మార్చాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం షిఫ్ట్ 7గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఉంటుంది. దీన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చాలని కోరుతున్నారు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. దీన్ని సాయంత్రం 4 గంటల నుంచి 11 వరకు మార్చాలని అంటున్నారు. గతంలో వేసవి వచ్చిందంటే ఈ కొత్త పనివేళలు అమలు చేసేవారు. కానీ గత మూడేళ్ల నుంచి ఎన్నిసార్లు కార్మికులు డిమాండ్ చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఈసారైనా వేళలు మార్చాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి ఎస్కే బాజీసైదా డిమాండ్ చేశారు.
శ్రీరాంపూర్: రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఓపెన్ కాస్టు ప్రాజెక్టు(ఓసీపీ)లు వేడెక్కుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగడంతో ఓసీపీలు, ఇతర సర్ఫేస్ డిపార్టుమెంట్లలో పని చేస్తున్న కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోల్చితే సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఓసీపీ ప్రాంతాల్లో బొగ్గు అంతా ఎండలో ఉండడంతో దాని ప్రభావం వల్ల ఉష్ణోగ్రత రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతుంది. ఎండ వేడి వల్ల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లి రీజియన్‌లో ఉన్న ఓసీపీల్లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంపల్లి ఏరియా పరిధి కై రిగూడ, మందమర్రి ఏరియా పరిధి కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ, శ్రీరాంపూర్ ఏరియా పరిధి ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీలు ఉన్నాయి. శ్రీరాంపూర్ ఓసీపీలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది. శనివారం 39 డిగ్రీలు నమోదు కాగా, మందమర్రిలో 38 డిగ్రీలు, బెల్లంపల్లిలో 39 డిగ్రీలు నమోదైంది. వీటిలో ఎండ తీవ్రతను కార్మికులు తట్టుకోవడం కోసం కంపెనీ ఉపశమన చర్యలు చేపట్టింది.
చలువ పందిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఎండలు ముదురడంతో కార్మికులు వడదెబ్బ బారిన పడకుండా ఉండడం కోసం యాజమాన్యం ఉపశమన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని ఓసీపీల్లోని క్వారీల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విధులకు వెళ్లే సమయంలో కార్మికులకు ఓఆర్‌ఎస్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు కార్యాలయాల వద్ద వాటర్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. కార్మికులు పని స్థలాల వద్దకు చల్లని నీరు తీసుకెళ్లడం కోసం ప్రత్యేకంగా కూల్ బాటిళ్లు అందజేశారు. ఓసీపీల్లో ఓబీ పనులు, సీహెచ్‌పీల వద్ద బెల్ట్ క్లీనింగ్, షెల్‌పికింగ్, రోడ్లు ఊడ్చే ఇతర కార్మికులకు కూడా కాంట్రాక్టర్లు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అయితే కాలనీల్లో సివిక్ పనులు చేసే కాంట్రాక్టు కార్మికులకు మాత్రం ఇవ్వడం లేదు. వారికి కూడా వడదెబ్బ తగలకుండా ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆర్కేపీ ఓసీపీ మూసివేత కార్యక్రమం సాగుతుండడంతో అక్కడ వేసవి ఉపశమన చర్యలు నామమాత్రంగానే చేపట్టింది.
వాహనాల్లో ఏసీ
క్వారీల్లో నడిచే వాహనాలన్నీ ఏసీ కండీషన్‌లో ఉంచాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు షవ ల్స్, డంపర్లు, డోజర్లు ఇతర అన్ని భారీ వాహనాల్లో ఏసీలు చెడిపోతే మరమ్మతు చేయిస్తున్నారు.