
మహిళలకే యూనిఫాం కుట్టు పని
● యూనిఫాం క్లాత్ పంపిణీ షురూ ● 768 మంది మహిళలకు లబ్ధి ● మే 20లోపు పూర్తి చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలు కుట్టే బాధ్యతలు మరోసారి మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. దుస్తులు ఎలా కుట్టాలి, కొలతలు వంటి మార్గదర్శకాలను వివరించారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి దుస్తుల డిజైన్లు మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మారిన దుస్తుల ఆకృతితో కుట్టేందుకు సులభతరంగా మారింది. జిల్లాలో 10,417 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 1,15,018 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కుట్టు నైపుణ్యం కలిగిన 768 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మే 20నాటికి దుస్తులు కుట్టే పని పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. శనివారం నుంచి మండలాల వారీగా ముడివస్త్రం పంపిణీ చేస్తున్నారు.
రెండేసి జతలు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందించనున్నారు. 768 పాఠశాలల్లో 42,711 మంది ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 630 పాఠశాలల్లో 28,845మంది చదువుతున్నారు. బాలురు 13,774 మంది, బాలికలు 15,071 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతంలో 138 ప్రభుత్వ పాఠశాలల్లో 13,886 మంది ఉండగా.. బాలురు 6,247 మంది, బాలికలు 7,619 మంది ఉన్నారు. విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులకు ముడివస్త్రం 1,86723 మీటర్లు కావాల్సి ఉండగా 58,059 మీటర్లు జిల్లాకు సరఫరా అయ్యింది. వేసవి సెలవుకు ముందే యూనిఫామ్‌కు అవసరమైన వస్త్రం జిల్లాకు చేరడంతో కుట్టే బాధ్యతలు మహిళలకు అప్పగించారు.
వస్త్రం పంపిణీ..
స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో శనివారం ఏకరూప దుస్తుల వస్త్రాన్ని మహిళా సంఘాల సభ్యులకు డీఈవో యాదయ్య, డీఆర్‌డీవో కిషన్ పంపిణీ చేశారు. గ్రామీణ అభివృద్ధి ఏపీఎం, ప్రధానోపాధ్యాయులు, మెప్మా టీఎంసీలు మ్యాపింగ్ చేసిన సంఘాల సంభ్యులకు అందజేశారు. సభ్యుల సెల్‌ఫోన్ నంబర్లు ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. ప్రతీ పాఠశాలలోనూ విద్యార్థుల కొలతలు ఈ నెల 15లోపు పూర్తి చేయాలని డీఈవో యాదయ్య ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాళవీదేవి, సెక్టోరల్ అధికారి చౌదరి, టీఎంసీ చంద్రయ్య, టౌన్‌లెవల్ ప్రెసిడెంట్ జ్యోతి, స్వయం సహాయక సంఘాల పాల్గొన్నారు.