పదో తరగతి విద్యార్థులకురేపటి నుంచి ప్రారంభం
● మార్చి 20 వరకు కొనసాగింపు ● జిల్లావ్యాప్తంగా 7,521 మందికిప్రయోజనం ● 21 నుంచి వార్షిక పరీక్షలు
మెదక్‌జోన్: ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు సాయంత్రం వేళ అల్పాహారం అందజేయడానికి నిధులు కేటాయిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 9.15 గంటల వరకు, 9.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు విద్యార్థులు పాఠశాలలో పాఠాలు వింటున్నారు. అనంతరం 5.30 గంటల వరకు స్పెషల్ క్లాసులకు హాజరవుతున్నారు. ఉదయాన్నే పాఠశాలకు బయలుదేరుతున్న విద్యార్థులు రాత్రి ఇంటికి చేరుకునే సరికి పొద్దుపోతుంది. అంతసేపు మధ్యా హ్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందజేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
167 ప్రభుత్వ.. 7 మోడల్ పాఠశాలలు
జిల్లావ్యాప్తంగా 167 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, 7 మోడల్ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,521 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. అలాగే కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నప్పటికీ.. వాటిలో చదివే విద్యార్థులకు అల్పాహారం అందజేయడం లేదు. కాగా పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తికావడంతో నెల రోజుల నుంచే ప్రత్యేక తరగతులను ప్రారంభించారు.
ఒక్కో విద్యార్థికి రూ. 15 ఖర్చు
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే వి డుదలైంది. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అల్పాహారం రేపటి నుంచి మార్చి 20వ తేదీ వరకు ఇవ్వా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 వెచ్చిస్తోంది. రోజుకో వైరెటీ చొప్పున ఆరు రకాల అల్పాహారం అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా 7,521 మంది విద్యార్థుల కోసం రూ. 1,12,815 ఖర్చు చేయనున్నారు.
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
గతేడాది పదో తరగతిలో 92.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. ఈసారి అలా కాకుండా వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు నెలరోజుల నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ఏ, బీ, సీలుగా విభజించి బోధన సాగిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తరచూ స్లిప్ టెస్ట్‌లు
పెడుతూ పర్యవేక్షిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది
ఉదయం 8 గంటల నుంచే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభం అవుతుండటంతో కొంతమంది సాయంత్రం స్పెషల్ క్లాస్ ముగిసే వరకు ఉండకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కాగా ప్రభుత్వం విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు ముందుకు రావడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈసారి వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నాం.
– రాధాకిషన్, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment