మహిళా ఉద్యోగులకు సన్మానం
మెదక్ కలెక్టరేట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ.. సా మాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్‌వాడీ సెంటర్ల తనిఖీ
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పాతూర్, పాతూర్ తండా అంగన్‌వాడీ కేంద్రాలను డీడబ్ల్యూఓ హైమావతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం వారికి పెడుతున్న భోజనం గురించి ఆరా తీశారు. ఆమె వెంట సీడీపీఓ వెంకటరమణమ్మ, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.
11న జిల్లాస్థాయి
వైజ్ఞానిక ప్రదర్శన
మెదక్ కలెక్టరేట్: ఈనెల 11న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో విద్యార్థులు వారి ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించవచ్చని చెప్పారు.
‘ఎల్‌ఆర్‌ఎస్’ రాయితీని వినియోగించుకోండి
చేగుంట(తూప్రాన్): ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని వినియోగించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి అన్నారు. శుక్రవారం చేగుంట గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీఓ ఎల్‌ఆర్‌ఎస్ రాయితీకి సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులకు మార్కెట్ రేటును అనుసరించి 25 శాతం రాయతీ కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సందర్శించి డీపీఓ ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. చేగుంటతో పాటు అనంతసాగర్ గ్రామాల్లో పారిశుద్య పనులు, డంప్‌యార్డులను పరిశీలించి, ఇంటిపన్నులు, మంచినీటి సరఫరా గురించి సిబ్బందికిసూచనలు చేశారు.
నేడు జాతీయ
లోక్ అదాలత్: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: నేడు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు. తమ ఆధార్ కార్డు తీసుకుని, సంబంధిత కోర్ట్ లేదా నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలన్నారు. కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియను పూర్తి చేసి కేసును పూర్తిగా ముగించుకునే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్‌తో కేసుల తక్షణ పరిష్కారం సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చికాకుల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. కేసులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment