ముళ్లబాట దాటి.. పూలదారి చేరి
మెదక్‌జోన్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన నారాయణ మెదక్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో పట్టణంలో స్థిరపడ్డారు. అంతాబాగానే ఉంది అని అను కుంటున్న సమయంలో అనూహ్య సంఘటనతో జీవితం తలకిందులైంది. 1998లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ మృత్యువాతపడ్డారు. అప్పటికీ ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందులో పెద్దకూతురు గంగామణి 8వ తరగతి చదువుతుంది. ఆమె తల్లి మల్లమ్మకు అధికారులు స్వీపర్ ఉద్యోగం ఇచ్చారు. నిరక్షరాస్యురాలైన మల్ల మ్మ తన పెద్దకూతురు గంగామణికి పదో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం వివిధ కారణాలతో దంపతులు విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలతోపాటు చెల్లెళ్ల భారం ఆమైపె పడింది. చిన్నప్పటినుంచి పోలీస్ కావాలనే కోరిక బలపడింది. ఈక్రమంలో 2007లో హోంగార్డుగా హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించింది. తన చెల్లెళ్లు, పిల్లలను మెదక్‌లో తల్లి వద్ద ఉంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూనే డిస్టెన్స్‌లో ఇంటర్ పూర్తి చేసింది. 2013లో రెండో ప్రయత్నంలో కానిస్టేబుల్‌గా ఎంపికై ంది. తన ఇద్దరు చెల్లెళ్లను బీటెక్ చదివించింది. వారు 2019లో వారిద్దరూ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. అలాగే ఆమె ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. కుమారుడు నవీన్‌చంద్ర ఎస్సైగా, కూతురు శ్రీజ 2023లో కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం కొడుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రొహిబిషనరీ ఎస్సైగా, కూతురు మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గంగామణి చేగుంట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. పురుషుల కన్నా తక్కువ అనే భావన మహిళల్లో ఉండొద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించటం కష్టమేమి కాదని గంగామణి అభిప్రాయపడ్డారు.
చిన్నతనంలో తండ్రి మరణం, ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం భర్త దూరం.. ఇద్దరు
చెల్లెళ్లు.. వృద్ధురాలైన తల్లి.. ఒకానొక దశలో ఆమె కుంగుబాటుకు గురైంది. ఆ ముళ్లబాటనే తొక్కుకుంటూ మణిగా మెరిసింది. ఆమె కాంతులీనుతూ కుటుంబసభ్యులకు పూలబాటను పరిచింది. నారీలోకానికి స్ఫూర్తిమంత్రం వినిపించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘గంగామణి’ విజయగాథపై ప్రత్యేక కథనం..
Comments
Please login to add a commentAdd a comment