
ప‘రేషన్’..!
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
నిండుకున్న బియ్యం నిల్వలు
● తెరుచుకోని రేషన్ దుకాణాలు ● జిల్లాలో 2,13,777 కార్డుదారులు ● 6,85,178 మంది లబ్ధిదారులు ● కావాల్సిన బియ్యం 35 వేల క్వింటాళ్లు
ఇంకెప్పుడిస్తారు?
గతంలో ప్రతి నెల 1వ తేదీన బియ్యం వచ్చేవి. రెండు నెలలుగా సకాలంలో ఇస్తలేరు. ఇప్పటికే వారం గడిచిపోయింది. డీలర్‌ను అడిగితే గోదాం నుంచి బియ్యం రాలేవని చెబుతున్నాడు. ఇంట్లో బియ్యం లేవు. బయట కొందామంటే ధరలు మండిపోతున్నాయి. బతికేదెట్లా?
– వెంకయ్య, వై. మాందాపూర్, కొల్చారం
రెండు, మూడు రోజుల్లో సరఫరా
బియ్యం సరఫరాకు ఆర్డర్ కాపీ వచ్చింది. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తాం. ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సన్నబియ్యం వచ్చాక దొడ్డు బియ్యం వృథా అవుతాయని గోదాముల్లో స్టాక్ ఉంచడం లేదు. దీంతో బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది.
– జగదీష్, జిల్లా సివిల్ సప్లై మేనేజర్
మెదక్ కలెక్టరేట్: ప్రతీ నెల 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంటుంది. అయితే 8 రోజులు గడుస్తున్నా ఇంకా పంపిణీ చేయడం లేదు. పేదలు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతుండగా, డీలర్లు గోదాముల వద్ద పడిగాపులు గాస్తున్నారు. అయితే బియ్యం నిల్వలు లేకపోవడంతో అధికారులు గోదాములు తెరవడం లేదని సమాచారం. ప్రతి నెల 20వ తేదీ నుంచి 30 వరకు మండల స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. వచ్చిన బియ్యాన్ని డీలర్లు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. కాని మూడు నెలలుగా బియ్యం సరఫరాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 522 రేషన్ షాపులు
జిల్లాలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేటలో మండలస్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి జిల్లాలోని 21 మండలాల్లో గల రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం వీటిలో ఏ ఒక్కదానిలో బియ్యం నిల్వలు లేనట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 522 రేషన్ దుకాణాలు ఉండగా, 2,13,777 కార్డులు (కొత్తవి కాకుండా), 6,85,178 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెల 35 వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది.
పట్టణ దుకాణాలకు సరఫరా
పట్టణ ప్రజలు ఆందోళనలకు దిగుతారనే ఉద్దేశంతో ఉన్న కొద్దిపాటి నిల్వలు పట్టణంలోని 120 దుకాణాలకు సరఫరా చేసినట్లు సమాచారం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలకు సరఫరా చేసేందుకు గోదాముల్లో బియ్యం నిల్వలు కరువయ్యాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే గాని గోదాములకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. అయితే ఇప్పటికే వారం గడిచిపోయింది. అసలు బియ్యం సరఫరా చేస్తారా? లేదా అని ఇప్పటికే గ్రామాల్లో ఆందోళన మొదలైంది.
న్యూస్‌రీల్

ప‘రేషన్’..!

ప‘రేషన్’..!
Comments
Please login to add a commentAdd a comment