
ఆన్‌లైన్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు
మెదక్ మున్సిపాలిటీ: యువత ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్‌లకు పాల్పడిన, గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని విద్యార్థులు, యువత అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. వీటి కట్టడికి జిల్లా పోలీస్‌శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని వివరించారు. అక్రమ బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు మీ చుట్టూ పక్కల ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలని సూచించారు.
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి