
ిసీటీస్కాన్ సేవలు ఎప్పుడో..?
మెదక్ జోన్: జిల్లా ఆస్పత్రికి ిసీటీస్కాన్ యంత్రం తీసుకొచ్చి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. అయినా ప్రారంభించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇన్‌స్టాలేషన్ అవుతుందంటూ సమాధానం చెబుతున్నారు. నూతనంగా సీటీస్కాన్‌ను ఏర్పాటు చేస్తే కేవలం వారం రోజుల్లో ప్రక్రియ అంతా పూర్తవుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఎంతో మంది పేద రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
అందుబాటులో లేని పరికరాలు
జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు అయిందని ప్రజలు ఎంతో సంబురపడ్డారు. ఇక నుంచి అత్యవసర వైద్యం అందుబాటులోకి వస్తుందని భావించారు. అన్నిరకాల స్పెషలిస్టులతో పాటు ఎంఆర్‌ఐ, టూడీఎకో లాంటి పరికరాలు (ల్యాంబ్) అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అవేం అందుబాటులోకి రాలేదు. దీంతో నరాలకు సంబంధించిన సమస్య వస్తే రూ. 8 వేలు చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ చేయించుకోవాల్సి వస్తోంది. అలాగే గుండె సంబంధిత పరీక్ష (టూడీఏకో) రూ. 5 వేలు చెల్లించి పరీక్ష చేయించుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగితే పరీక్ష నిర్ధారణ చేసే యంత్రం (సీ–ఆర్మ్) జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉన్నప్పటికీ అది చెడిపోయి చాలా కాలం అయింది. దానికి మరమ్మతులు చేయించే నాథుడే కరువయ్యారు. ఫలితంగా దీని పరీక్ష అవసరం వచ్చిందంటే ప్రైవేట్‌లో చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అందని ద్రాక్షగా సర్కారు వైద్యం
జిల్లాలో 19 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు, 3 సీహెచ్‌సీ ఆస్పత్రులు, 1 ఏరియా ఆస్పత్రి, 1 మాతాశిశు ఆస్పత్రితో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రి ఉంది. వీటి పరిధిలో పెద్ద ఆరోగ్య సమస్య ఉత్పన్నమైతే జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. రోగ నిర్ధారణ తరువాతే వైద్యులు చికిత్స ప్రారంభించాల్సి ఉండగా.. అందుకు అవసరమయ్యే అనేక పరికరాలు అందుబాటులో లేవు. వెరసి పేద రోగులకు ప్రభుత్వం వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది.
ఈ చిత్రంలోని వ్యక్తి పేరుయాదగిరి. ఇతనిది చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామం. ఇటీవల తలకు దెబ్బతగలటంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయం అయినందున సీటీస్కాన్ చేయించాలని సూచించారు. ఆస్పత్రిలో సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌లో రూ. 2,300 చెల్లించి రిపోర్టు తీసుకొచ్చారు.