పౌల్ట్రీ.. పల్టీ! | - | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ.. పల్టీ!

Published Fri, Mar 28 2025 6:17 AM | Last Updated on Fri, Mar 28 2025 6:15 AM

జిల్లాలో మూడు వేల పైచిలుకు కోళ్ల ఫారాలు మూత

ఈ చిత్రంలోని పౌల్ట్రీ రైతు పేరు ఆరె యాదగిరి. ఇతనిది చిన్నశంకరంపేట మండలం జంగరాయి. ఏడాది క్రితం తన వ్యవసాయ పొలంలో 7.5 వేల కెపాసిటీ గల కోళ్ల ఫారం నిర్మించాడు. ఇందుకు రూ. 15 లక్షలు ఖర్చు కాగా, రూ. 10 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. మిగితా రూ. 5 లక్షలు సొంత నిధులు వెచ్చించాడు. బ్యాంకులో తీసుకున్న అప్పును రెండు నెలలకు రూ. 73 వేల చొప్పున వాయిదాల రూపంలో చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటికే ఐదు బ్యాచ్‌ల కోళ్లు పెంచి వచ్చిన కమీషన్‌ డబ్బులు బ్యాంకులో కట్టాడు. కాగా నెల రోజుల క్రితం 7,500 కోడి పిల్లలను పెంచగా, వాటిలో కేవలం 300 కోళ్లు మాత్రమే తీసుకెళ్లిన సదరు కంపెనీ నిర్వాహకులు, మిగితా వాటికి వ్యాధి సోకిందని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక వాటిని గుంతలో పూడ్చి పెట్డాడు. ఈ క్రమంలో బ్యాంకు వాయిదా కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఎలా చెల్లించాలని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇది ఒక్క యాదగిరి పరిస్థితే కాదు. జిల్లాలోని వేలాది మంది పౌల్ట్రీ రైతులది.

చిన్నశంకరంపేట: జంగరాయిలో మూత పడిన కోళ్ల ఫారం

మెదక్‌జోన్‌: జిల్లాలో చెప్పుకోదగిన సాగునీటి వనరులు లేకపోవటంతో వ్యవసాయం సరిగా సాగక మూడు వేల పైచిలుకు రైతులు కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో 90 శాతానికి పైగా రైతులు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నారు. కాగా ఒక్క బ్యాచ్‌ కోళ్లను పెంచేందుకు 45 నుంచి 50 రోజుల సమయం పడుతుంది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈక్రమంలో ఎప్పుడూ లేని విధంగా వింత వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇదే సమయంలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. దీంతో 95 శాతం ప్రజలు చికెన్‌ తినటం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలను ఇవ్వటం పూర్తిగా మానేశారు. ఫలితంగా వేలాది కోళ్ల ఫాంలకు తాళాలు పడ్డాయి.

వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి

బ్యాంకులో తీసుకున్న రుణానికి సకాలంలో వాయిదాలు చెల్లించాలని, లేనిచో వడ్డీ, చక్ర వడ్డీ పడుతుందని బ్యాంకు అధికారులు పౌల్ట్రీ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలు కోడి పిల్లలు ఇవ్వక పౌల్ట్రీలకు తాళాలు వేశామని, బ్యాంకు వాయిదాలు ఎలా చెల్లించేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కించాలని, బ్యాంకులో తీసుకున్న రుణానికి వడ్డీ పడకుండా రెన్యూవల్‌ చేసే విధంగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

వింత వ్యాధితో మృత్యువాత పడిన కోళ్లు

వానాకాలం వరకు పెంపకంవద్దంటున్న అధికారులు

వాయిదాలు కట్టాలనిబ్యాంకు అధికారుల నోటీసులు

ఇది అనువైన సమయం కాదు

జిల్లాలో చనిపోయిన కోళ్ల రక్త నమూనాలను ఇప్పటికే రెండు సార్లు ల్యాబ్‌కు పంపించాం. బర్డ్‌ ఫ్లూ లేదని తేలింది. కానీ పెద్ద మొత్తంలో కోళ్లు ఎలా చనిపోయాయనేది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఇది కోళ్ల పెంపకానికి అనువైన సమయం కాదు. వానాకాలం వచ్చే వరకు రైతులు కోళ్ల పెంపకం నిలిపివేస్తేనే మంచిది.

– వెంకటయ్య, జిల్లా వెటర్నరీ అధికారి

పౌల్ట్రీ.. పల్టీ!1
1/1

పౌల్ట్రీ.. పల్టీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement