టైటిల్ : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?
జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్
నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణమురళి, హేమ, వైవా హర్ష హైపర్ ఆది తదితరులు
నిర్మాణ సంస్థ : ఎస్వీ ప్రొడక్షన్
నిర్మాత : ఎస్వీ బాబు
దర్శకత్వం : మున్నా ధూళిపూడి
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర
విడుదల తేది : జనవరి 29, 2021
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యతగా తనదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమర్‌తో అదరగొట్టే ప్రదీప్ మాచిరాజు.. సుమ తరువాత గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్నాడు. తనదైన శైలి హోస్టింగ్‌తో ఎన్నో షోలను విజయవంతంగా నడిపించాడు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చాలా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక తొలిసారి హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే డిఫెరెంట్ టైటిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(జనవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ తనకు మంచి పేరు తీసుకొస్తుందన్న ధీమాలో ప్రదీప్ ఉన్నాడు. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ వెండి తెరపై ఏ స్థాయిలో రాణించాడు? హీరోగా ప్రేక్షకులను మెప్పించాడా? రివ్యూలో తెలుసుకుందాం.
కథ
వైజాగ్‌లో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే అల్లరి స్టూడెంట్ అర్జున్(ప్రదీప్ మాచిరాజు). చదువంటే ఇష్టం ఉండదు కానీ బాక్సింగ్ అంటే ప్రాణం. అదే కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థిని అక్షర(అమృతా అయ్యర్). అమృతకి, అర్జున్‌కి అసలే పడదు. ఒకరంటే ఒకరికి కోపం, పగ, ద్వేషం. అనుకోకుండా వీరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వీరిద్దరికి ఓ పెద్ద సమస్య ఎదురువుతోంది. ఆ సమస్యకు పరిష్కారమేంటో స్వామిజీ(శుభలేక సుధాకర్) చెప్తాడు. దీంతో వీరిద్దరు ఇష్టంలేకున్నా 30 రోజుల్లో ప్రేమించుకోవాల్సి వస్తోంది. అసలు వీరిద్దరికి ఎదురైన సమస్య ఏంటి? వీరి జీవితాలకు, స్వామీజికి సంబంధం ఏంటి? వీరిద్దరికి ఒకరంటే ఒకరు ఎందుకు పడదు? ఇష్టం లేని వీరిద్దరు ఎందుకు ప్రేమించుకోవాల్సి వచ్చింది? చివరకు వీరి సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? అనేదే మిగతా కథ.
నటీనటులు
బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్రవేసుకున్నాడు ప్రదీప్. తనదైన కామెడీ పంచ్‌లతో, సెన్సాఫ్ హ్యూమర్‌తో ఎన్నో షోలను విజయవంతం చేశాడు. షోలో ప్రదీప్ ఉంటే చాలు కామెడీకి కొదవ ఉండదు. తొలి సినిమాలో కూడా అదే కామెడీతో నవ్వించాడు ప్రదీప్. అర్జున్ అను అల్లరి స్టూడెంట్ పాత్రలో జీవించేశాడు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించేశాడు. యాంకర్‌గా తనకున్న ఎక్స్‌పీరియన్స్ సినిమాకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. తనదైనశైలీలో నవ్విస్తూనే.. అవసరం ఉన్న చోట ఎమోషనల్ సీన్లను కూడా అవలీలగా చేసేశాడు.
ప్రదీప్ తర్వాత బాగా పండిన పాత్ర అమృతది. అక్షర అనే యువతి పాత్రలో అమృత జీవించేసింది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక పోసాని కృష్ణమురళి, హేమల అనుభవం మరోసారి తెరపై చూడొచ్చు. వైవా హర్ష తనదైన కామెడీతో అందరిని నవ్వించేశాడు. హైపర్ ఆది, మహేశ్, శుభలేఖ సుధాకర్ తమ పాత్రల పరిధి మేర నటించారు.
విశ్లేషణ
యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఇది తొలి సినిమా. మొదటి సినిమాతోనే ప్రదీప్‌తో ప్రయోగం చేయించాడు దర్శకుడు మున్నా. పునర్జన్మల కథ ఎంచుకుని దర్శకుడు మంచి ప్రయత్నమే చేశాడు. కానీ ఆ కథని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. నేటి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఉండవు. అలాగే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, ఆడియన్స్‌ని ఇన్‌వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. సీరియస్ కథ అయినా.. కామెడీతో నడిపించే ప్రయత్నం చేసి కాస్త విఫలమయ్యాడు. హీరో, హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.
ఫస్ట్ హాఫ్‌లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అలాగే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాప్‌ను కామెడీగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా నడుపుదామనుకొని కాస్త విఫలం అయ్యాడు. ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా 'నీలి నీలి ఆకాశం..' పాట ఎంత గొప్పగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగా లేదు. కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే. ఈ సినిమా ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగాలేదు కానీ, చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ నటన
ఇంటర్వెల్ ట్విస్ట్
అనూప్ రూబెన్స్ సంగీతం
మైనస్ పాయింట్స్
కథాకథనం
సాగదీత సీన్లు
ప్రీ క్లైమాక్స్
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment