
కోలీవుడ్‌లో ప్రయోగాలకు ఆద్యుడు లోకనాయకుడు కమలహాసన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, అపూర్వ సహోదర్ గళ్, దశావతారం ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ హాసన్ కెరీర్‌లో ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కమలహాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్– 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన తన గెటప్ కోసం అనేక గంటలు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ చిత్రం తర్వాత కమలహాసన్ మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. కాగా కమలహాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 1987లో నాయకన్ చిత్రం రూపొంది సంచలన విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత వీరి కాంబో రిపీట్ కాబోతోంది.
తాజా సమాచారం ప్రకారం ఇంకా పేరు నిర్ణయం కాని ఈ చిత్రంలో కమలహాసన్‌తో పాటు ఏడు రాష్ట్రాలకు చెందిన స్టార్ హీరోలు నటించనున్నారు. ఆ ఏడుగురులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఒకరనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. మరో విశేషం ఏంటంటే కమలహాసన్, షారుక్ ఖాన్ ఇంతకుముందు హే రామ్ అనే చిత్రంలో కలిసి నటించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.