
హీరో కమల్‌హాసన్–దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో ‘నాయగన్’–1987 (‘నాయకుడు’) తర్వాత 37 ఏళ్లకు రూపొందనున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, ‘జయం’ రవి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ ఖరారయ్యారు. తాజాగా ఐశ్వర్యా లక్ష్మి ఈ జాబితాలో చేరారు. ఈ చిత్రంలో ఆమె నటించనున్నట్లు గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే... ‘థగ్ లైఫ్’లోకి ఐశ్వర్యా రాయ్ ఎంట్రీ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది.
మణిరత్నం దర్శకత్వంలో ‘ఇద్దరు, గురు, రావణ్, పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాల్లో ఐశ్వర్యా రాయ్ నటించారు. మరి... ‘థగ్ లైఫ్’లో ఆమె నటించనున్నది నిజమేనా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కావచ్చాయని, ఈ నెలాఖరులో షూటింగ్ ఆరంభమయ్యే చాన్స్ ఉందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment