ప్రేక్షకుల కళ్లు నా కలర్‌ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్‌ చక్రవర్తి | 70th National Film Awards: Mithun Chakraborty, Rishab Shetty, And Nithya Menen Honoured By President Droupadi Murmu | Sakshi
Sakshi News home page

ప్రేక్షకుల కళ్లు నా కలర్‌ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్‌ చక్రవర్తి

Published Wed, Oct 9 2024 12:24 AM | Last Updated on Wed, Oct 9 2024 10:53 AM

70th National Film Awards: Mithun Chakraborty and Rishab Shetty and Nithya Menen honoured by President Droupadi Murmu

‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్‌ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్‌ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.

మంచి డ్యాన్సర్‌ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్‌ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని  అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి. 

దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను  ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్‌’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్‌ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్‌ (తిరుచిత్రంబలం–తమిళ్‌), మానసీ పరేఖ్‌ (కచ్‌ఎక్స్‌ప్రెస్‌–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్‌ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్‌ సెల్వన్‌– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్‌ రెహమాన్‌ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. 

ఈ వేదికపై ఇంకా మిథున్‌ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్‌... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.

నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత  హాలీవుడ్‌ యాక్టర్‌ అల్‌ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్‌ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్‌ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.

మంచి మార్పు తీసుకురావాలన్నదే...:  రిషబ్‌ శెట్టి
ప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.

కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్‌ 
చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను.  

సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్‌ రెహమాన్‌ 
సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్‌ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్‌ మణిరత్నంగారికి ధన్యవాదాలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement