
బాలీవుడ్ నటుడు అమన్ వర్మ (Aman Verma)- వందన లల్వానీ (Vandana Lalwani) విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. తొమ్మిదేళ్ల బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించుకోలేక విడిపోవడానికే నిర్ణయించుకున్నట్లు భోగట్టా! 'నిజానికి వీరు పిల్లల్ని కని కుటుంబాన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో బేధాభిప్రాయలు రావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో వందన విడాకుల కోసం దరఖాస్తు చేసింది' అని బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది.
2016లో వివాహం
దీని గురించి నటుడు అమన్‌ను ప్రశ్నించగా సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు తన లాయర్ చెప్తాడన్నారు. దీంతో దంపతుల విడాకుల వ్యవహారం నిజమేనని తేలిపోయింది. అమన్- వందన 2014లో హమ్ నే లి హై: శపథ్ అనే టీవీ సిరీస్‌లో తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2015లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. 2016లో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.

ఎన్నో ఏళ్లుగా ఒంటరిగా..
పెళ్లి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో అమన్ మాట్లాడుతూ.. పెళ్లి నన్ను ఎంతగానో మార్చేసింది. ఒకప్పుడు చిన్నవిషయాలకే కోపం వచ్చేది. కానీ ఇప్పుడు చాలామటుకు సైలెంట్ అయిపోయాను. అలాగే ఎన్నో ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాను. మంచి భాగస్వామి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలా వందన కనిపించాక తనను పెళ్లాడాను. మేము చాలా సంతోషంగా ఉన్నాను. ఒకరిపై ఒకరికి ఎలాంటి ఫిర్యాదులు లేవు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమో 53 ఏళ్ల వయసులో విడాకులకు సిద్ధమయ్యాడు.
బుల్లితెర.. వెండితెర
అమన్ వర్మ.. పచ్‌పన్ ఖంబే లాల్ దీవారేన్, మహాభారత్ కథ (కర్ణుడి కుమారుడు), క్యూంకీ సాస్ భీ కభీ బహూ తీ, కెహతా హై దిల్, కుంకుమ్.. ఇలా అనేక సీరియల్స్ చేశాడు. సంఘర్ష్, జానీ దుష్మన్, అండాజ్, దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్, కచ్చీ సడక్, జనని, జాన్-ఇ-మన్, ఈఎమ్‌ఐ, తీస్ మార్ ఖాన్. చికెన్ కర్రీ లా, ద యూపీ ఫైల్స్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాడు. వందన లల్వానీ సైతం సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment