
విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలు విజయంతో మంచి జోష్‌లో ఉన్న నటుడు కార్తీ తాజాగా కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి జపాన్ అనే టైటిల్ నిర్ణయించారు. దీనిని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్, ప్రభు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇంతకుముందు కార్తీ హీరోగా శకుని, కాష్మోర, ధీరన్ అధికారం ఒండ్రు, సుల్తాన్ తదితర సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. తాజాగా వీరి కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ ఆరో చిత్రం అవుతుంది. కాగా ఈ సంస్థ ఇంతకుముందు రాజు మురుగన్ దర్శకత్వంలో నిర్మించిన జోకర్ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. కాగా తాజాగా కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న జపాన్ చిత్రానికి రాజు మురుగన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇందులో నటి అను ఇమ్మానియేల్ కథానాయికగా నటిస్తుండగా టాలీవుడ్ నటుడు సునీల్, చాయాగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, రవివర్మ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్‌ను తూత్తుకుడిలో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కాగా కార్తీ, దర్శకుడు రాజమురుగన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే మంచి అంచనాలు నెలకొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment