టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో కొద్దిరోజుల్లో సందడి చేయనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే ఆయన పెరిగారు. అందుకే తన సోదరి నిఖితతో కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌ను స్థాపించి పలు సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా నితిన్ మరో అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్‌లో మల్టీఫ్లెక్స్ థియేటర్‌ను స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్ పేజీ నుంచి ఒక ఫోటో విడుదలైంది.
మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్స్ ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని మల్టీఫ్లెక్స్‌లు నిర్మించారు. త్వరలో బెంగళూరులో AMB ప్రారంభం కానుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో రవితేజ ART కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే, హీరో నితిన్ కూడా సంగారెడ్డి ప్రాంతంలో ఏషియన్ నితిన్ సితార పేరుతో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనకు సంబంధించిన ఫ్యాన్ పేజీలలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఓపెనింగ్ కానున్నట్లు సమాచారం.
నితిన్ సినిమాల విషయానికి వస్తే.. తమ్ముడు త్వరలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాంతార ఫేం సప్తమి గౌడ నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' చిత్రంలో కూడా నితిన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment