
Actor Vijay's fans plan to contest urban local body polls: నటుడు విజయ్ రాజకీయ తెరంగేట్రంపై చాలాకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఎం. చంద్రశేఖర్ విజయ్ మక్కల్ ఇయక్కం అంటూ పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించారు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే విజయ్‌కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు చేసుకుంటున్నారనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడరాదని ఆంక్షలు విధించినా అభిమానులు గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం వారంతా విజయ్‌ను కలిసి ఫొటోలు దిగి పండుగ చేసుకున్నారు.
చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య)
ఇది రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేసిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని గురించి విజయ్ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుపై పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు.