
చలన చిత్రసీమలో బాలనటిగా ప్రవేశించి నాలుగున్నర దశాబ్దాలుగా స్క్రిప్ట్‌రైటర్‌గా, రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్‌గా, కథానాయకిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఇలా వెండితెరకు చెందిన విభిన్న అంశాల్లో రాణిస్తూ గుర్తింపు పొందిన నటీమణి రోహిణి. ‘యశోదకృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుని పాత్ర వేసిన ఆ చిన్నారి ‘అప్పావిన్‌మీసై’ (నాన్న మీసం) అనే తమిళ సినిమాకు దర్శకురాలిగా మారారు. ఆమె గొంతులోని మాధుర్యం ఎందరో కథానాయికల సక్సెస్‌కు పరోక్ష కారణమైంది. జీవితంలో ఎన్నో కష్టా సుఖాలను ఎదుర్కొన్న ఆమె ఐదేళ్లకే తల్లిని కోల్పోవటం విషాదం. ‘గీతాంజలి’ సినిమాలో హీరోయిన్ గిరిజకు డబ్బింగ్ చెప్పిన ఆమె ఇపుడు తల్లి పాత్రలో ఒదిగిపోతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దేశంలోనే సంచలనమైన బాహుబలిలో ప్రభాస్‌కు తల్లిగా నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఆమె పుట్టిన ఊరు మన అనకాపల్లి పట్టణమే. ఇక్కడ జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను సాక్షి కలుసుకున్నప్పుడు తన అనుభవాలు ఇలా పంచుకున్నారు.
సాక్షి, అనకాపల్లి (విశాఫట్నం): మాకు అనకాపల్లితో ఎంతో అనుబంధం ఉంది నేను అనకాపల్లిలోనే పుట్టాను. ఐదేళ్ల వరకు ఈ పట్టణంలోనే∙పెరిగాను. మా నాన్నగారికి సినిమాలంటే ఇష్టం. మా అమ్మగారు చనిపోయేటప్పటికీ నాకు ఐదేళ్ల వయసు. అప్పుడు.. చెన్నైకి వెళ్లిపోయాం. విజయరామరాజుపేటలో నాన్నగారికి ఇల్లు ఉంది. మా మేనమామకు వేల్పుల వీధి లో ఇల్లు ఉంది. ఇటీవల మా నాన్నగారు చనిపోయారు. వారి కార్యక్రమం కోసమే అనకాపల్లి వచ్చాం. నా సోదరుడు సినీ నటుడు బాలాజీ కూడా ఇక్కడకు వచ్చాడు. అనకాపల్లికి వచ్చిన సందర్భంగా బంధువులందరినీ కలిశాం.
► తమిళంలో ‘అప్పావిన్‌మీసై’ చిత్రానికి దర్శకత్వం వహించాను. ‘వెల్కమ్ ఒబామా’ సినిమాకు సింగీతం శ్రీనివాసరావుగారి వద్ద సహాయకురాలిగా పని చేసిన అనుభవం ‘అప్పావిన్‌మీసై’ దర్శకత్వం వహించడానికి దోహదపడింది. తమిళనాడు ప్రేక్షకులను అభిమానాన్ని కూడా పొందటం నా అదృష్టం.
పన్నెండేళ్లదాకా అక్షరాలు దిద్దే అవకాశం రాలేదు
చిన్నప్పుడే తల్లికి దూరం కాగా భర్త రఘువరన్‌కు దూరమైన సందర్భంగా ఒంటరి జీవితమే అనిపించినప్పుడల్లా సినీ రంగ మిత్రులు, బంధువుల ఆప్యాయత ధైర్యాన్నిచ్చేది. ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు సెట్‌లో షూటింగ్‌లు చేస్తున్నప్పుడు అందరూ నన్ను మీ అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా అని అడిగేవారు. ఆ ఆప్యాయత నాకెంతో ధైర్యాన్ని ఇచ్చేది. బాగా చదువుకోవాలనిపించి నాన్నగారు మొల్లేటి రామునాయుడును చిన్నప్పుడు కోరేదాన్ని. నాన్నగారు పంచాయతీ అధికారిగానూ, కొద్దిపాటి వ్యాపారం ఉండడంతో ఆయనకు సినిమారంగంపై ఆసక్తి ఉండేది. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు. అమ్మ రాధ చనిపోయిన తర్వాత చెన్నైకు వెళ్లిపోయాం. అప్పుడే యశోదకృష్ణ సినిమాలో చిన్నికృష్ణుని పాత్రకు ఎంపికయ్యాను. పన్నెండేళ్లు వస్తేనేగాని అక్షరాలు దిద్దే అవకాశం పొందలేకపోయా.
మలయాళ చిత్రరంగంలో మంచి పేరొచ్చింది
మలయాళం సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైనప్పుడు రఘువరన్‌ను చూశా. మలయాళ సినిమా రంగంలో బాగా పేరొచ్చింది. తదుపరి పరిణామాల్లో గీతాంజలి సినిమాకు డబ్బింగ్ చెప్పాను. శివ సినిమాలో అమల పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు మొదట్లో నిరాకరించాను. బొంబాయి సినిమాలో మనీషా కొయిరాలాకు తగ్గట్టుగా గొంతు మార్చుకునేందుకు శ్రమపడ్డాను. రావణ్ సినిమాలో ఐశ్వర్యారాయ్‌కు డబ్బింగ్ చెప్పాను. తెలుగు, తమిళంలో డబ్బింగ్ చెబుతూ మలయాళం కథానాయకిగానే గుర్తింపు పొందా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డునిచ్చింది. రఘవరన్‌తో ఉన్న ప్రేమ కాస్తా పెళ్లిగా మారింది. బాబు పుట్టిన తర్వాత మనసులు కలవక ఇష్టపూర్వకంగానే విడిపోయాం.
సినిమా రంగంలో బాలనటుల కష్టనష్టాలపై సైలెంట్ హ్యూస్ పేరుతో డాక్యుమెంటరీని 45 నిమిషాల నిడివితో తీశాను. తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా, రచయితగా అవతారమెత్తాను. నందిని తీసిన అలా మొదలైంది సినిమాలో నేను చేసిన తల్లిపాత్ర ఓ మంచి అవకాశంగా భావిస్తా. నా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఉద్వేగాలు నన్ను మానసికంగా దృఢపరిచాయి. రఘువరన్ చిన్నవయసులోనే చనిపోయినప్పటికీ ఆయన చనిపోవడానికి ముందు కొన్ని పాటలు పాడి వీడియో తీశారు. ఆ ఆల్బమ్‌ను రజనీకాంత్ చేతులమీదుగా ఆవిష్కరించాం. బాహుబలిలో ప్రభాస్ తల్లిగా నటించడం చాలా సంతోషాన్ని కలిగించింది. అన్ని పాత్రలూ నాకు డ్రీమ్‌రోల్సే. 300లకుపైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుని ప్రేక్షకుల అభిమానం పొందిన నేను ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తా. (చదవండి: క్రాక్ నుంచి ‘మాస్ బిర్యానీ’ సాంగ్ రిలీజ్)